చుక్కేసి.. ఊచలు లెక్కేసి..! ఓరుగల్లు డ్రంక్ అండ్‍ డ్రైవ్‍ లో జైలు కేసుల రికార్డు

చుక్కేసి.. ఊచలు లెక్కేసి..! ఓరుగల్లు డ్రంక్ అండ్‍ డ్రైవ్‍ లో జైలు కేసుల రికార్డు
  • వరంగల్‍ కమిషనరేట్లో గతేడాది 96 డీడీ జైలు కేసులు
  • ఈ ఏడాది 6 నెలల్లోనే 416 మందికి జైలు శిక్ష 
  • గతేడాది రూ.కోటి 82 లక్షల డీడీ జరిమానాలు వసూలు
  • ఈసారి ఆరు నెలల్లోనే రూ.కోటి 64 లక్షల జరిమానాలు

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు మూడు జిల్లాల పరిధిలో పనిచేసే వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ గతానికి భిన్నంగా ఈసారి డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍ కేసుల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది. 2024 లో మాత్రం 96 మంది డీడీ (డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍) కేసుల్లో కటకటాల్లోకి వెళ్లారు. ఈసారి పోలీసులు రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా మందుబాబులపైనే ప్రత్యేక దృష్టిల్లో పెట్టడంతో కేవలం 6 నెలల్లోనే గతేడాది కేసులను అధిగమించి 300 శాతానికి కేసులు పెరిగాయి.

6 నెలల్లో 416 మందికి జైలు.. 

వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలోని వరంగల్‍, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలీస్‍ అధికారులు ఈ ఏడాది డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍ కేసులపై ఫోకస్‍ పెట్టారు. పోలీసు అధికారుల లెక్కల ప్రకారం 2024 జనవరి నుంచి డిసెంబర్‍ వరకు 20,338 డీడీ కేసులు నమోదవగా, ఇందులో 96 మంది జైలు శిక్ష వరకు వెళ్లారు. ఈ ఏడాది మాత్రం గతంలో ఎప్పుడూలేని విధంగా కేవలం 6 నెలల్లోనే 19,153 డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍ కేసులు నమోదు చేశారు. ఇందులో మోతాదుకుమించి అత్యధింగా మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్డు రవాణా రూల్స్​కు విరుద్ధంగా ప్రవర్తించిన ఘటనలో కోర్టు 416 మందికి జైలు శిక్ష విధించింది. 

ఇందులో 364 మందికి జైలు శిక్ష వేయగా, మరో 52 మందికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. ఈ లెక్కన వరంగల్‍ కమిషనరేట్లో మొదటి ఆరు నెలల్లోనే పోలీసులు రికార్డు స్థాయిలో గతేడాది కంటే 300 శాతం కంటే ఎక్కువ డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍ జైలు శిక్షల కేసులు నమోదు చేసినట్లయింది. అంతేకాకుండా డీడీ కేసుల్లో ఉన్న మరో 150 మందికి కోర్టు సోషల్‍ సర్వీస్‍ చేసే పనిష్మెంట్లు విధించింది.

రూ.కోటి 64 లక్షల జరిమానాలు..

వరంగల్‍ పోలీసులు 2024లో మొత్తం 20,338 డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍ కేసుల్లో కోర్టు ద్వారా రూ.కోటి 82 లక్షలు జరిమానాలు విధించింది. 2025 లో ఆరు నెలల్లోనే రూ.కోటి 64 లక్షల 59 వేల జరిమానాలు విధించారు. ఈ లెక్కన సగం ఏడాది ముగిసేనాటికే గతేడాది జరిమానాల్లో 90 శాతం ఇప్పటికే వసూలు చేసినట్లయింది. హనుమకొండ ట్రాఫిక్‍ పోలీస్‍ స్టేషన్ల పరిధిలో 3,533 డీడీ కేసుల్లో రూ.35 లక్షల 82 వేలు ఉండగా, కాజీపేట ట్రాఫిక్‍ నుంచి 3,427 కేసుల్లో రూ.39 లక్షల 15 వేలు, వరంగల్‍ మట్వాడా పీఎస్‍ పరిధిలోని స్టేషన్ల ద్వారా 3,272 డీడీ కేసుల్లో రూ.35 లక్షల 32 వేలకుపైగా 
జరిమానాలు విధించారు. 

డ్రైవింగ్‍ లైసెన్స్​ సస్పెన్షన్‍ చేపిస్తం.. 

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల క్షేమం లక్ష్యంగా వరంగల్‍ ట్రాఫిక్‍ పోలీసులు పనిచేస్తున్నారు. శిక్షలు, జరిమానాలు వేయడం మా ఉద్దేశం కానప్పటికీ మద్యంతాగి వాహనాలు నడపొద్దని చెప్పినా విననివారిపై కఠినంగా ఉంటున్నాం. బహిరంగంగా లిక్కర్‍ తాగడం, తాగి రోడ్లపై బండ్లు నడుపొద్దని సీరియస్‍గా చెబుతున్నాం. ఇక నుంచి మోతాదుకుమించి డీడీ కేసుల్లో దొరికినవారి డ్రైవింగ్‍ లైసెన్స్​ సస్పెన్షన్​ చేసేలా ప్రతిపాదనలు పంపిస్తాం.

రాయల ప్రభాకర్‍రావు, ట్రాఫిక్‍ అడిషనల్‍ డీసీపీ, వరంగల్‍

వారంలో 490 డీడీ కేసులు, 22 మంది జైలుకు

ఈ నెల 5 నుంచి వారం పాటు వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍లో 490 డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍ కేసులు నమోదు చేసినట్లు వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍ శనివారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా డీడీ కేసులు నమోదు చేయగా, 22 మందికి రెండ్రోజులపాటు జైలు శిక్ష పడ్డట్లు పేర్కొన్నారు. వాహనదారులకు కోర్టు రూ.4,46,800 జరిమానా విధించినట్లు చెప్పారు. వాహనదారులు మద్యం సేవించి రోడ్డు ప్రయాణాలు చేయడం ద్వారా ప్రమాదాలకు గురికావొద్దని  సీపీ సూచించారు.