ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • కలెక్టరేట్లు, కార్యాలయాల ముందు ఆడిపాడిన మహిళా ఉద్యోగులు

వెలుగు నెట్ వర్క్: బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆఫీసుల ముందు మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లు, వివిధ శాఖల కార్యాలయాల ముందు పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చి, వేడుకలు జరుపుకొన్నారు. హనుమకొండ, ములుగు కలెక్టరేట్లతో పాటు గ్రేటర్ వరంగల్ బల్దియా హెడ్ ఆఫీసు బతుకమ్మ ఆడారు. నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో జిల్లా ఐసీడీఎస్​ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. హనుమకొండ వేయిస్తంభాల గుడి వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. వివిధ ప్రైవేట్ కాలేజీల్లోనూ బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకున్నారు.

మహాలక్ష్మిగా భద్రకాళి అమ్మవారు

వరంగల్ భద్రకాళి అమ్మవారు గురువారం మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం సావిత్రి మాతగా అలంకరించి సూర్యప్రభ వాహనం ఊరేగించారు. సాయంత్రం బ్రాహ్మీమాతగా హంసవాహనంపై ఊరెగింపు చేపట్టారు. జనగామ కలెక్టర్ శివలింగయ్యతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. – వరంగల్ సిటీ, వెలుగు

‘కేసీఆర్ ను దూరం చేసుకోవద్దు’

కమలాపూర్, వెలుగు: ‘కేసీఆర్ ఎనిమిదేండ్లలో చిన్న గ్రామానికైతే రూ.50కోట్లు, పెద్ద గ్రామానికైతే రూ.100కోట్లు ఇచ్చిండు. చాలా కష్టపడి ఆ డబ్బు తెచ్చిండు. అలాంటి పెద్ద మనిషిని దూరం చేసుకుంటే మన కడుపులే మాడుతయ్. కేసీఆర్ కు మన అవసరం లేదు. మనకే కేసీఆర్ అవసరం ఉంది’ అని ఎమ్మెల్సీ పాడి కౌశికర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలో బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దేశ రాజకీయాల్లోని వెళ్తున్నారని, ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తడక రాని, జడ్పీటీసీ లాండిగే కల్యాణి, సింగిల్​విండో చైర్మన్ పేరాల సంపత్ రావు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు తదితరులున్నారు.

సర్కారు ఆసుపత్రుల్లో సౌలతులు కల్పిస్తాం

వరంగల్​సిటీ, వెలుగు: ప్రభుత్వాసుపత్రుల్లో సౌలతులు మెరుగుపరుస్తామని వరంగల్ ఎంపీ దయాకర్, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. గురువారం ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ గోపితో కలిసి వరంగల్ 27వ డివిజన్ లోని ఆయుష్ టీచింగ్ మెడికల్ కాలేజీలో కొత్తగా నిర్మించిన 80 బెడ్ల గదులను, ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ ను హెల్త్ హబ్ గా మారుస్తామన్నారు. ఇప్పటికే రూ.1100కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు. బస్తీ దవాఖానాలను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చింతాకుల అనిల్ తదితరులున్నారు.

ఎస్సీ హాస్పిటల్ పరిశీలన

కాశిబుగ్గ: వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటలోని ఎస్సీ హాస్పిటల్​ను గురువారం ఎమ్మెల్యే నరేందర్, కలెక్టర్ గోపి పరిశీలించారు. భవనం చాలావరకు దెబ్బతిందని, హాస్పిటల్​ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తేమన్నారు. ఆఫీసర్లు ఇందుకు అవసరమైన రిపేర్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

మోడీతోనే అవినీతిరహిత పాలన

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు

హనుమకొండ, వెలుగు: దేశంలో అవినీతిరహిత పాలన కేవలం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే సాధ్యమవుతోందని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​రావు అన్నారు. ఆర్థిక ప్రగతిలో దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. 
సేవా సప్తాహ్​ కార్యక్రమంలో భాగంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో  గురువారం హంటర్​ రోడ్డులోని సత్యం కన్వెన్షన్​హాల్​లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు ఆయన చీఫ్​గెస్ట్​ గా హాజరై మాట్లాడారు.

ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్​ 370 రద్దు, సర్జికల్​ స్ట్రైక్స్​ తదితర ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ఘనత మోడీకే దక్కుతుందన్నారు. బీజేపీకి ఎన్నికల సమయంలోనే రామమందిర నిర్మాణం గుర్తుకు వస్తుందని కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ప్రధాని మోడీ చిత్తశుద్ధి వల్ల ఇప్పటికే మందిరం పనులు స్టార్ట్​ అయ్యాయని రఘునందన్​రావు తెలిపారు. 2024 ఎన్నికలకంటే ముందే రామ మందిరం పనులన్నీ కంప్లీట్​ అవుతాయని చెప్పుకొచ్చారు. మోడీ నిర్ణయాల వల్ల పంటల ఉత్పత్తి పెరిగిందని, వరంగల్ కు ఎయిర్​ పోర్టు మోడీ తోనే సాధ్యమవుతుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మందాడి సత్యనారాయణరెడ్డి, నాయకులు పులి సరోత్తం రెడ్డి, దారం జనార్ధన్​, జలంధర్​ రెడ్డి, దేశిని సదానందం, ఆర్​పీ జయంత్ లాల్  తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు కోరిన సమాచారం ఇవ్వాలి

మహబూబాబాద్, వెలుగు: ఆర్టీఐ ద్వారా ప్రజలు కోరిన సమాచారాన్ని ఆఫీసర్లు ఇవ్వాలని ఆర్టీఐ స్టేట్ కమిషనర్ గుగులోతు శంకర్ నాయక్ ఆదేశించారు. గురువారం మహబూబాబాద్ కలెక్టరేట్ లో ‘అప్పీల్ హియరింగ్’ నిర్వహించారు. ఆర్టీఐ అప్లికేషన్లకు సంబంధించి 21 కేసులను విచారించారు. ఆర్టీఐ చట్టాన్ని ప్రజలకు తెలియజేసేందుకు మీడియా సహకరించాలన్నారు. కరోనా సమయంలోనూ టెలిఫోనిక్ ద్వారా అప్పీల్ హియరింగ్ చేపట్టామన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో 30వేల పైచిలుకు అప్పీల్లను పరిష్కరించామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శశాంకను కలిశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో  కొమురయ్య,  తహసీల్దార్ నాగభవాని తదితరులున్నారు.

క్వాలిటీ లేకపోవడంతోనే   ఉక్కు ఫ్యాక్టరీ పెట్టట్లే!

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టీఆర్ఎస్ లీడర్లు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.రాజవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే నిబంధన విభజన హామీలో ఉందని గుర్తు చేశారు. ఉక్కులో క్వాలిటీ లేకపోవడం వల్లే ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం వెనకడుగు వేసిందన్నారు. దీనిని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వల్లే నేడు గందరగోళం ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.

తూర్పులో మార్పు ఖాయం

వరంగల్ సిటీ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పులో మార్పు ఖాయమని, బీజేపీ జెండా ఎగరడం తథ్యమని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. వరంగల్ అజంజాహీ మిల్ భూములతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం సిగ్గుచేటన్నారు. గురువారం 34వ డివిజన్ లో దాదాపు వంద మంది కార్యకర్తలు బీజేపీలో చేరగా వారికి ప్రదీప్ రావు కండువా కప్పారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానన్నారు. అధికార పార్టీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

పల్లె దవాఖాన ప్రారంభం

వెంకటాపూర్, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో గురువారం పల్లె దవాఖానాను ప్రారంభించారు. చీఫ్ గెస్టుగా డీఎంహెచ్ వో డా. పళ్లెం అప్పయ్య హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ హాస్పిటల్​లో ఒక డాక్టర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మందల సుచరిత, ఉప సర్పంచ్ శంకర్, సెక్రటరీ రజిత తదితరులున్నారు.

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

పాలకుర్తి, వెలుగు: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన పెద్దబోయిన రమేశ్(32) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాడు. గురువారం గోడలకు నీళ్లు పట్టేందుకు మోటార్ బిగిస్తుండగా.. కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

పుట్ట మధును గెలిపించాలి

కాటారం/మహదేవపూర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే పుట్ట మధును గెలిపించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్​పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఓ వర్గం లీడర్లు పుట్ట మధుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. గురువారం కాటారం మండలంలో టీఆర్ఎస్ నాయకులు యువ చైతన్య పాదయాత్ర చేపట్టారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. పుట్ట మధు గెలుపే లక్ష్యంగా ఈ నెల 26న పాదయాత్ర మొదలు పెట్టామని చెప్పారు.

పుట్ట మధు వల్లే మంథని అభివృద్ధి చెందుతోందన్నారు. కాగా,  ఈ పాదయాత్ర కాటారంలోని గంగారం క్రాస్ మీదుగా మహదేవపూర్ మండలం అన్నారం చేరుకుంది. పలువురు టీఆర్ఎస్ లీడర్లను సత్కరించి, ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు భూపెల్లి రాజు, మండల నాయకులు తోట జనార్దన్, మహాదేవపూర్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్మన్ సల్ల తిరుపతయ్య, మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, నాయకులు మనోహర్, ప్రకాశ్, శ్రీనివాస్, రామిళ్ల కిరణ్ తదితరులున్నారు.

‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు’ 

హనుమకొండ సిటీ, వెలుగు: సోషల్ మీడియాతో తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హనుమకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌజ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ పత్రికలో వచ్చిన కథనానికి తన ఫొటో జోడించి, దళిత బంధు కోసం రూ.2లక్షలు తీసుకున్నాడంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ లీడర్లే ఇలా చేశారని, దళితబంధు పారదర్శకంగా అమలవుతుంటే ఆ పార్టీ ఓర్చుకోలేకపోతోందన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న 25వేల మందికి దళితబంధు అందించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

10శాతం రిజర్వేషన్ ఇంకెప్పుడు?

జనగామ, వెలుగు: వారం రోజుల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ జీవో రిలీజ్ చేస్తామని చెప్పి కేసీఆర్ మరోసారి మోసం చేశారని బీజేపీ గిరిజన మోర్చా నాయకులు మండిపడ్డారు. గురువారం జనగామ జిల్లాకేంద్రంలో గిరిజన మోర్చా రాష్ర్ట ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్​కలెక్టర్ అబ్దుల్ హమీద్ కు వినతిపత్రం ఇచ్చారు. ఎల్లయ్య మాట్లాడుతూ.. 12 రోజులైనా జీవో విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రిజర్వేషన్లతో పాటు గిరిజన బంధు సైతం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు బానోత్ రాంకోటి నాయక్ ,ప్రధాన కార్యదర్శి అనిల్ నాయక్, ఉపాధ్యక్షులు రామ్నాయక్ ,నరేశ్​ నాయక్, మహిపాల్, కోట వినోద్​ కుమార్, ధరావత్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి 22కోట్లు ఖర్చు చేశాం

మొగుళ్లపల్లి, వెలుగు: మొగుళ్లపల్లి మండలంలోని వేములపల్లి గ్రామాన్ని గడిచిన నాలుగేండ్లలో రూ.22కోట్లతో అభివృద్ధి చేశామని సర్పంచ్ బెల్లంకొండ మాధవి శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సొంత ఖర్చులతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం తనవంతు నిధులు అందజేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సైతం రూ.5లక్షలు ఇచ్చారని తెలిపారు.

కేఎంసీలో‘వరల్డ్ హార్ట్ డే’

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ కేఎంసీలో గురువారం ‘వరల్డ్ హార్ట్ డే’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్లంతా కలిసి కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డా.చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపల్ డా.మోహన్ దాస్ మాట్లాడారు. ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి, పేదలకు ప్రభుత్వాసుపత్రి పట్ల నమ్మకం పెంచామన్నారు. ఇదిలా ఉండగా.. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన మహిళను గురువారం బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన కేఎంసీలో అరుదైన చికిత్సలు కూడా విజయవంతంగా పూర్తవుతున్నాయన్నారు.

గ్రాండ్ గా ఫ్రెషర్స్ డే

హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ భీమారంలోని జగతి గార్డెన్​లో గురువారం గౌతమ్ జూనియర్​కాలేజీ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. చీఫ్ గెస్టుగా ప్రముఖ సైకాలజిస్ట్ బరుపటి గోపి హాజరై ప్రోగ్రాంను ప్రారంభించారు. స్టూడెంట్లు చదువులో రాణించి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలన్నారు. అనంతరం స్టూడెంట్లు డాన్సులతో హోరెత్తించారు. కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం సందరాజు సంతోష్, మంతిని బిక్షపతి, గొట్టె లక్ష్మణ్, నాగపురి సురేశ్​గౌడ్, గొట్టె మహేందర్, బండి పరశురాం, ధనుంజయ్, శ్రీకాంత్ తదితరులున్నారు.

ఎస్సై, కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వేటు

స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: జనగామ జిల్లా చిల్పూరు మండల ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను వరంగల్ సీపీ తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. ఈమేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చిల్పూరు ఎస్సై ఎం.రాజు, కానిస్టేబుళ్లు జి.రాజు, ఎం.రాజేందర్ లపై ఇటీవల అవినీతి, ఆరోపణలు రావడంతో సీపీ రహస్యంగా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.