పెదవికి కుట్లు వేయాల్సింది పోయి కన్ను కింద కోశాడు

పెదవికి కుట్లు వేయాల్సింది పోయి కన్ను కింద కోశాడు

మద్యం మత్తులో కరీంనగర్​ ప్రభుత్వ దవాఖానా వార్డుబాయ్‌ నిర్వాకం 

కరీంనగర్ సిటీ, వెలుగు :  ఓ వ్యక్తి పెదవి పగిలి ట్రీట్​మెంట్ ​కోసం మంగళవారం రాత్రి కరీంనగర్ ​జిల్లా ప్రభుత్వ దవాఖానాకు రాగా, మద్యం మత్తులో ఉన్న వార్డుబాయ్‌ పెదవికి కుట్లు వేయాల్సింది పోయి కన్ను కింద కోశాడు. మంగళవారం రాత్రి ఓ వ్యక్తికి ప్రమాదంలో పెదవి పగిలింది. దీంతో వెంటనే సర్కారు దవాఖానాకు తీసుకురాగా పరీక్షించిన డ్యూటీ డాక్టర్‌ కుట్లు వేయమని వార్డుబాయ్‌ ప్రవీణ్ కు చెప్పాడు. అయితే అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి ఉన్న అతడు పెదవికి కుట్లు వేయకుండా కన్ను కింది భాగంలో బ్లేడ్‌తో కోశాడు. దీంతో పేషెంట్‌ తో పాటు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా డాక్టర్, నర్సులు, పేషెంట్​బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. సదరు వార్డుబాయ్‌ గతంలో కూడా మద్యం మత్తులో ఇలా చేశాడని తెలుస్తోంది. వార్డుబాయ్​పై సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.  ఘటనపై సూపరింటెండెంట్‌ రత్నమాలను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించలేదు.