
- ఏడాది క్రితం పులి కడుపుకు చుట్టుకున్న ఇనుప తీగ
- ఇటీవల గర్భం దాల్చినట్లుఅనుమానాలు
పట్టు కునేందుకు ఫలించనిప్రయత్నాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ‘కే–4 ’ పులిని రక్షించడం ఫారెస్ట్ ఆఫీసర్లకు కత్తిమీద సాములా మారింది. ఏడాదిన్నర కిందట వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని తృటిలో బయటపడిన ఈ పులికి.. ఇప్పటికీ ఇనుప తీగ చుట్టుకుపోయి ఉండటం కలవర పెడుతోంది. కే–4 ఆచూకీ కనిపెట్టి ఉచ్చును తొలగించేందుకు ఏడాదికి పైగా ఆఫీసర్లు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఈ మధ్య ఆ పులి ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఉచ్చు మరింత బిగుసుకొని పులి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెప్తున్నారు.
ఇదీ పులి కథ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అభయారణ్యంలో ఆవాసం ఏర్పరచుకున్న పెద్దపులి ‘ఫల్గుణ’కు.. 2016 జనవరిలో నాలుగు పిల్లలు పుట్టాయి. కాగజ్‌నగర్ పేరు స్ఫురించేలా వాటికి కే–1, కే–2, కే–3, కే–-4 అని ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్లు పెట్టారు. ఇందులో మిగతా మూడింటి జాడ కనిపించకున్నా.. కే–4 పులి మాత్రం కాగజ్‌నగర్ నుంచి చెన్నూర్ ఫారెస్టులోకి ప్రవేశించింది. ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకొని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, కాటేపల్లి, నీల్వాయి ఏరియాల్లో తిరుగుతోంది. ఈ ప్రాంతంలో గత కొంత కాలంగా వేటగాళ్ల ఉచ్చులకు రెండు పులులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇదే క్రమంలో అప్పటికే 11 నెలల వయసున్న కే–4 పులి వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. అయితే ఉచ్చుగా అమర్చిన ఇనుప తీగ పులి కడుపుకు చుట్టుకుపోయినట్లు సీసీ కెమెరాల్లో ఫారెస్టు ఆఫీసర్లు గుర్తించారు.Was
ఎంత ట్రై చేసినా ఆచూకీ దొరకట్లే
పులికి చుట్టుకుపోయిన తీగను తొలగించేందుకు ఫారెస్టు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించట్లేదు. ఈ క్రమంలో ఏడాదిన్నర గడిచింది. మొదట చెన్నూర్, వేమనపల్లి, నీల్వాయి అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కే–4 కదలికలను కనిపెట్టేందుకు ప్రయత్నించారు. అది సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి.. లేగదూడలను ఎరగా వేసినా లాభం లేకుండాపోయింది. కిందటేడాది ఢిల్లీ నుంచి టైగర్ ట్రాకర్ వాసిమ్ను రప్పించి.. వారం పాటు చెన్నూర్ ఫారెస్ట్ ఏరియాలో తిరిగినా పులి జాడ కనిపించలేదు.