పంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్‎గా వీడియో

పంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్‎గా వీడియో

వచ్చే ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో ఒక రాష్ట్రమైన పంజాబ్‎లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మహమ్మారి కారణంగా అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్‌షోలు మరియు ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. దాంతో రాజకీయ పార్టీలు ఆన్‌లైన్ ప్రచారంలో వేగం పెంచాయి. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో ద్వారా రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రచారం చేయడానికి కాంగ్రెస్ హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ను ప్రేరణగా తీసుకుంది.

అవెంజర్స్ సినిమాలో ఎంతో ఫేమస్ అయిన యుద్ధ సన్నివేశాన్ని ఉపయోగించి ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని సూపర్ హీరో థోర్‌గా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హల్క్‌గా చూపించారు. అదేవిధంగా నవజ్యోత్ సింగ్ సిద్ధూని కెప్టెన్ అమెరికాతో పోల్చారు. కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‎లను గ్రహాంతరవాసులుగా చూపించారు. వీరితో పాటు పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మరియు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌లను కూడా గ్రహాంతరవాసులుగా చిత్రీకరించారు.

‘పంజాబ్ మరియు పంజాబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్ట శక్తుల బారి నుండి మా రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి మేము ఏమైనా చేస్తాం’అని పంజాబ్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మార్వెల్ థీమ్ సాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్నఈ వీడియోలో.. తన పార్టీ సభ్యులను రక్షించడం కోసం చన్నీ గొడ్డలి ఉపయోగించి గ్రహాంతరవాసులందరి గొంతులను కోయడం ద్వారా వీడియో ప్రారంభమవుతుంది. ఈ క్లిప్‌లో రాహుల్ గాంధీ పోరాటానికి సిద్ధమవుతున్నప్పుడు.. పంజాబ్ భాషలో ‘మీరు ఇకపై రక్షించబడలేరు’అని చెప్పడం కూడా కనబడుతుంది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియో.. చన్నీ మరియు ఇతరులు తమ ఆయుధాలతో శత్రువుల వైపు పరిగెత్తి వారిని చంపడంతో ముగుస్తుంది. ఫిబ్రవరి 20న పంజాబ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

For More News..

తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది

టీఆర్ఎస్ ప్రభుత్వంలో హమాలీలుగా నిరుద్యోగ విద్యార్థులు

కాళేశ్వరం కోసం 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు