హైదరాబాద్‌లోనూ ‘వాటర్ బెల్‍’

హైదరాబాద్‌లోనూ ‘వాటర్ బెల్‍’

సర్కార్​, ప్రైవేట్‍ బడుల్లో రోజూ 4 సార్లు బ్రేక్​

స్టూడెంట్లు నీళ్లు తాగేందుకు 5 నిమిషాల సమయం

విద్యాశాఖ ఆదేశాలు

హైదరాబాద్‍, వెలుగుగవర్నమెంట్‍, ప్రైవేట్‍ స్కూల్స్ లో ఇక మీదట రోజులో నాలుగు సార్లు ‘వాటల్‍ బెల్‍’ కొట్టాలని విద్యాశాఖ సూచించింది. వాటర్‍ బెల్‍ కోసం 5 నిమిషాలు కేటాయించాలని ఆ సమయంలో విద్యార్థులు మంచినీరు తాగేలా చర్యలు తీసుకోవాలంది. విద్యార్థులు సరిపడా వాటర్​తాగకపోవడంతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని విద్యాశాఖ గుర్తించింది. దీనికి పరిష్కారంగా వాటర్ బెల్‍ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వాటర్‍ బెల్‍ అమలు చేయడం మంచి పరిణామమని అదే సమయంలో స్కూల్స్ లో విద్యార్థులకు మంచినీరు అందుబాటులో ఉంచడంతోపాటు విద్యార్థుల సంఖ్యకు తగినన్ని బాత్రూంలను ఏర్పాటు చేయాలని విద్యారంగ నిపుణులు, పేరెంట్స్ కోరుతున్నారు.

రోజుకు నాలుగు సార్లు బెల్

జిల్లా పరిధిలో సుమారు 920 వరకు ప్రభుత్వ, ఎయిడెడ్‍ స్కూల్స్ ఉన్నాయి. వాటితోపాటు సుమారు 2600 వరకు ప్రైవేట్‍ స్కూల్స్ నడుస్తున్నాయి. వీటన్నింటిలో దాదాపు 8.60 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉదయం స్కూల్‍ ప్రారంభం నుంచి మధ్యాహ్నం లంచ్‍ బెల్‍ మధ్యలో రెండు సార్లు వాటర్‍ బెల్‍ కోసం 5 నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది. లంచ్‍ నుంచి ఇంటికి పోయే వరకు ఉన్న సమయంలో మరో రెండు సార్లు వాటర్‍ బెల్‍ కోట్టాలని విద్యాశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రైవేట్‍ స్కూల్స్ సైతం విద్యార్థులకు ఫిల్టర్‍ వాటర్‍ అందుబాటులో ఉంచాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఇంటినుంచి మంచినీరు తెచ్చుకోవడం ఉత్తమమని విద్యారంగ నిపుణులు, డాక్టర్లు సూచిస్తున్నారు.

బాత్రూం బెంగతోనే దూరం

స్కూల్‌కు వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లినవారు మూత కూడా తీయకుండా ఇంటికి అలాగే తీసుకురావడం ప్రతి ఇంట్లో కనిపించే దృశ్యాలే. దీనికి అనేక కారణాలు ఉంటాయని సికింద్రాబాద్‍ పరిధిలో ప్రభుత్వ స్కూల్‍లో పనిచేస్తున్న సీనియర్‍ టీచర్‍ మల్లికార్జున్‍ చెప్పారు. తరచూ బాత్రూంకు పోవాల్సి వస్తుందని స్టూడెంట్స్ స్కూల్‍ టైంలో ఎక్కువగా నీరు తాగేందుకు ఆసక్తి చూపడం లేదంటున్నారు. ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువగా విద్యార్థినుల్లో ఉందన్నారు. పిల్లలు రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాల్సి ఉంటుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. కానీ చాలా మంది పిల్లలు రోజుకు లీటర్‍కు మించి తాగడం లేదు.

కేరళ స్ఫూర్తితో…

విద్యార్థుల్లో డీహైడ్రేషన్‌ సమస్యను అధిగమించేందుకు కేరళ రాష్ట్రంలోని స్కూల్స్ లో ప్రత్యేకంగా ‘వాటర్‌ బెల్‌’ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగేలా అక్కడి టీచర్లు చొరవ తీసుకున్నారు. దాంతో దాదాపుగా ఆ సమస్యను అధిగమించారు. ఆ విషయం ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నగరంలోని పలు ప్రైవేట్‍ స్కూల్స్ ఇప్పటికే వాటర్‍ బెల్‍ను అమలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు –

అమ్మవారికి మొక్కాడు.. కిరీటం కొట్టేశాడు

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి