మహిమ కదా : ఈ చెట్టులో నుంచి నీళ్లు.. మోటార్ వేసినట్లు ధారగా..

మహిమ కదా : ఈ చెట్టులో నుంచి నీళ్లు.. మోటార్ వేసినట్లు ధారగా..

సాధారణంగా మనం బోర్ల నుంచి,బోరింగ్ లనుంచి నీళ్లు రావడం చూసి ఉంటాం. కానీ చెట్లల్లో నుంచి నీరు రావడం ఎప్పుడైనా చూశారా లేదు కదా..  కానీ ఈ అద్భుతం అల్లూరి జిల్లా దేవిపట్నం, రంపచోడవరం అటవీ ప్రాంతంలో అద్భుతం జరిగింది.  పాపికొండ‌ల్లోని కింటుకూరు అటవీప్రాంతంలోని బేస్ క్యాంపును పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లగా అక్కడ ఈ జలధార వృక్షం ఉండడాన్ని వారు గమనించారు.

 ఓ ఫారెస్ట్ గార్డ్ కత్తితో చెట్టుకు కొద్దిమేర రంధ్రం చేయగా, కుళాయి తిప్పినట్టు నీళ్లు ధారాళంగా  బయటికి వచ్చాయి. దీనిని నల్లమద్ది చెట్టు అంటారని... దీని నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తోందని అధికారులు తెలిపారు.  ఈ దృశ్యాన్ని అధికారులు త‌మ కెమెరాల్లో బంధించారు. తాజాగా ఈ వీడియోను అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. గతంలోనూ ఓ ప్రాంతంలో మద్ది చెట్ల నుంచి నీళ్లు వచ్చాయి.  

నల్లమద్ది చెట్టు కాండం కూడా మార్కెట్లో చాలా ఖరీదు ఉంటుంది. చాలా ఏపుగా పెరగడం, దాని కొమ్మలు కాండం చాలా దృఢంగా ఉండడం ఈ చెట్టు ప్రత్యేకత. దీనిని ఇంటి గ‌డ‌ప‌కు, త‌లుపుల త‌యారీకి వినియోగిస్తారు. అంతేకాకుండా కుర్చీలు, మంచాల త‌యారీకి కూడా ఈ చెక్కను విప‌రీతంగా ఉప‌యోగిస్తారు.