తెలుగు ప్రజలను విడగొట్టడానికే జలవివాదాలు

తెలుగు ప్రజలను విడగొట్టడానికే జలవివాదాలు
  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ పెద్ద బట్టేబాజ్.. సీమాంద్ర, తెలంగాణ ప్రజలను విడగొట్టడానికే జల వివాదాలు తెస్తున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గురువారం పార్టీ నేతలను కలసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. కేసుల కోసం ఢిల్లీకి వెళ్లి 360 డిగ్రీలు వంగిన నీవు జలాల కోసం పీఎం ను ఎందుకు కలువడం లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధుల సెంటిమెంట్ కే కేసీఆర్ బలవుతారని అన్నారు. తెలంగాణలో  షర్మిల పార్టీని బలోపేతం చేసే నీచపు క్రీడను కేసీఆర్ ఆడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ ను తిట్టకుండా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి నోళ్లకు కుట్లు వేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు కేసీఆర్ కు ఏటీఎం లాగా మారిపోయాయని, ఓట్లు కావాలంటే నీళ్లనే బూచిగా చూపిస్తాడని ఎద్దేవా చేశారు. 
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో లేని మంట పెట్టారు
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో లేనిమంట పెట్టేందుకు రాజకీయ లబ్ది పొందడానికి పార్టీలు మొహరించాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రాష్ట్రం రోజుకు కేవలం ఒక్క టీఎంసీకి మించి నీళ్లు పొందటం లేదని, అయితే ఏపీ మాత్రం ప్రతిరోజు 11టీఎంసీ నీళ్లను ఇప్పటికే తరలిస్తోందన్నారు. మార్కాపురం దారిదోపిడి దొంగల్లా..  ఏపీ సీఎం జగన్ జలదోపిడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగన్ నీళ్లు తీసుకుపోతున్నట్లు అసెంబ్లీలోనే ప్రకటించారు. ఆ తర్వాత జగన్ ను కేసీఆర్ ప్రగతి భవన్ పిలిచి విందు ఇచ్చారని, ఆ రోజే రాయలసీమ డ్రాఫ్ట్ జీవో కేసీఆర్ సవరించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 
ప్రాజెక్టుల మీద కోర్టులో కేసు ఓడిపోయే కుట్ర చేస్తున్నారు: రేవంత్ రెడ్డి 
ఏపీ రాయలసీమ ప్రాజెక్టు కడుతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రాజెక్టుల మీద అవగాహన లేని న్యాయవాదులను పెట్టి కోర్టులో కేసు ఓడిపోయేలా కుట్రలు చేస్తున్నారని రేవంత్  రెడ్డి ఆరోపించారు. జగన్ తెచ్చిన జీవోను అడ్డుకోవాలని నాగం జనార్దన్ రెడ్డి సీఎంకు లేఖ రాస్తే పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ ను తిట్టేవారు నికృష్టులు, కుష్టు రోగంతో పోతారని రేవంత్ రెడ్డి శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఆడనా ? లేక మగనా..? లేదా  అటుఇటు కానీ వారా..? అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నువ్వు రాజశేఖర్ రెడ్డి కొడుకును సన్మానిస్తే నీ మంత్రులు వైఎస్ ను ఎలా తిడుతరు.. వీటన్నింటి కి కారణం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలేనన్నారు. 
జగన్ నువ్వు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించే వాడివా?
ఏపీ సీఎం జగన్ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే వాడివా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ ను దొంగా అని తిడితే కూడా జగన్ విజయలక్ష్మి నోరు తెరువలేదని విమర్శించారు. వైఎస్ ఇచ్చిన పదవులు, ఆస్తులు కావాలి.. కానీ ఆయన్ను తిడితే మీరు మాట్లాడరా.. ? అని ఆయన నిలదీశారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్న సన్నాసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జగన్ ను షర్మిల ఎందుకు నిలదీయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వీరందరి నాటకాల గమమనించి ప్రజలంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.