సింగరేణిలో వాటర్​ ఫ్లోటింగ్ సోలార్ పవర్​ ఉత్పత్తి

సింగరేణిలో వాటర్​ ఫ్లోటింగ్ సోలార్ పవర్​ ఉత్పత్తి
  • 15న ప్రారంభించనున్న సింగరేణి

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: బొగ్గు తవ్వకాలు, థర్మల్, సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్న సింగరేణి తాజాగా వాటర్​ ఫ్లోటింగ్ సోలార్ పవర్​ ఉత్పత్తిలోకి అడుగుపెడుతోంది. సంక్రాంతి రోజున సింగరేణిలో కొత్త వెలుగులు పంచేందుకు మంచిర్యాల జిల్లా జైపూర్​సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) ​వేదిక కానుంది. ఇక్కడ నిర్మించిన నీటిపై తేలియాడే ఐదు మెగావాట్ల కెపాసిటీ వాటర్ ఫ్లోటింగ్​ సోలార్​ప్లాంట్​ను ఈ నెల15న ప్రారంభించేందుకు సింగరేణి సర్వం సిద్ధం చేసింది. థర్మల్​పవర్​జనరేషన్​వల్ల కాలుష్యం, బూడిద నిల్వలతో పర్యావరణం దెబ్బతింటోందని సోలార్​పవర్​వైపు మొగ్గు చూపుతోంది.  బొగ్గు ఉత్పత్తిలో 133 ఏళ్ల అపార అనుభవం కలిగిన సింగరేణి సంస్థ  ఏటా 100 మిలియన్​ టన్నుల టార్గెట్​ వైపు దూసుకెళ్తోంది. మరోవైపు జైపూర్​లోని సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​ద్వారా 1,200 మెగావాట్ల పవర్​ను ఉత్పత్తి చేస్తూ జాతికి వెలుగులు పంచుతోంది. త్వరలో మరో 800 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఉన్న వనరులను వినియోగిస్తూ  సింగరేణి వ్యాప్తంగా ఎనిమిది చోట్ల 219 మెగావాట్ల సోలార్​ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రెండేళ్ల కాలంలో 505 మిలియన్​ యూనిట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేసి రూ.300 కోట్లు ఆదా చేసింది.

ఎస్టీపీపీ నీళ్లపై తొలిప్రయోగం

సింగరేణి 1200 మెగావాట్ల థర్మల్​పవర్​ప్లాంట్​లో 10 మెగావాట్ల సోలార్​పవర్​ఉత్పత్తి కూడా చేస్తోంది. భూమి మీద సోలార్​ప్యానెళ్లు ఏర్పాటు చేసి పవర్​ఉత్పత్తి చేస్తుండా తొలిసారిగా ప్రయోగాత్మకంగా జైపూర్ ఎస్టీపీపీ ఆవరణలోని రిజర్వాయర్​నీళ్లపై సోలార్​పవర్​ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఎలాంటి అదనపు భూసేకరణ లేకుండా ప్లాంట్​లో 365 రోజులపాటు నిశ్చలంగా ఉండే 100 ఎకరాల రిజర్వాయర్(మూడు టీఎంఎసీ) నీటిపై రెండు ఫేజ్​ల్లో 15 మెగావాట్ల తేలియాడే సోలార్​పవర్​ప్లాంట్​ఏర్పాటుకు నిర్ణయించింది. 17 ఎకరాల విస్తీర్ణంలోని నీటిపై ఫస్ట్​ ఫేజ్​లో 5 మెగావాట్ల ప్లాంట్​నిర్మించింది. రిజర్వాయర్​నీటిలో 6 మీటర్ల ఎత్తులో తెలియడేలా 20 వేల సోలార్​ఫలకాలు ఏర్పాటు చేశారు. సోలార్​ప్యానెళ్లు గాలికి కదలకుండా ప్లాంట్​చుట్టూ 90 దిమ్మలు(పిల్లర్లు) నిర్మించారు. ఒక్కో మెగావాట్​కు రూ.5.2 కోట్ల చొప్పున మొత్తంగా రూ. 26 కోట్లను వెచ్చించింది.  25 ఏళ్ల పాటు జీవితకాలం ఉండే ఈ ప్లాంట్​లో దేశంలోనే తొలిసారిగా గ్లాస్​ టు గ్లాస్ టెక్నాలజీ​ సోలార్​ప్యానెళ్లు బిగించారు. హైదరాబాద్​కు చెందిన సంస్థ ఈ పనులు చేసింది. పదేళ్లపాటు నిర్వహణ సైతం చేపట్టనుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును జైపూర్​మండలకేంద్రానికి సమీపంలోని 33/11కేవీ ఎన్పీడీసీఎల్​ సబ్​స్టేషన్​కు అనుసంధానించనున్నారు. ఎస్టీపీపీ తర్వాత కరీంనగర్​ ఎల్ఎండీ డ్యాం నీటిపై 200 మెగావాట్లు,  సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మించిన మల్లన్న సాగర్​రిజర్వాయర్​లో రూ.1,800 కోట్ల వ్యయంతో  200 మెగావాట్ల వాటర్​ ఫ్లోటింగ్​పవర్ ప్లాంట్లను ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు చేస్తోంది. సర్కార్​నుంచి పర్మిషన్​రాగానే నిర్మాణ పనులు చేపట్టనుంది. 

సంకాత్రి రోజు ప్రారంభిస్తాం

ఎస్టీపీపీ రిజర్వాయర్​నీటిపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల వాటర్​ ఫ్లోటింగ్​సోలార్​ప్లాంట్​ను సంక్రాంతి రోజున ప్రారంభిస్తాం. మిగిలిన 10 మెగావాట్ల ప్లాంట్​ను మార్చి నాటికి అందుబాటులోకి తీసుకువస్తాం. 

– శ్రీధర్, సింగరేణి సీఎండీ