న్యూఢిల్లీ: 2025 డిసెంబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు 6.1 శాతం పెరిగి రూ.1.74 లక్షల కోట్లు దాటాయని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024 డిసెంబరులో ఈ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా లభించిన ఆదాయం 1.2 శాతం వృద్ధి చెంది రూ.1.22 లక్షల కోట్లకు చేరింది. దిగుమతి చేసుకున్న వస్తువుల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం 19.7 శాతం పెరిగి రూ.51,977 కోట్లుగా నమోదైంది.
గత నెలలో రిఫండ్లు 31 శాతం పెరిగి రూ.28,980 కోట్లకు చేరుకున్నాయి. రిఫండ్లను మినహాయించిన తర్వాత నికర జీఎస్టీ ఆదాయం రూ.1.45 లక్షల కోట్లుగా ఉంది. ఇది ఏడాది ప్రాతిపదికన 2.2 శాతం పెరిగింది. సెస్ వసూళ్లలో మాత్రం భారీ తగ్గుదల కనిపించింది. 2024 డిసెంబర్ నెలలో రూ.12,003 కోట్లుగా ఉన్న సెస్ గత నెలలో రూ.4,238 కోట్లకు పడిపోయింది. 2025 సెప్టెంబర్ 22 నుంచి సుమారు 375 వస్తువులపై పన్ను రేట్లను భారీగా తగ్గించడం వల్ల వసూళ్ల వృద్ధి కొంత నెమ్మదించింది. గతంలో విలాసవంతమైన వస్తువుల పైన కూడా కాంపెన్సేషన్ సెస్ ఉండేది. ప్రస్తుతం పొగాకు సంబంధిత ఉత్పత్తులపై మాత్రమే ఈ సెస్ విధిస్తున్నారు. పన్ను తగ్గింపు కారణంగా వస్తువులు చౌకగా మారినప్పటికీ ప్రభుత్వ ఆదాయ వృద్ధిపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
