న్యూఢిల్లీ: 2025 క్యాలెండర్ సంవత్సరంలో ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్లో మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వాహన్ పోర్టల్ లెక్కల ప్రకారం మారుతీ సుజుకీ 17,84,788 వెహికల్స్‌ను విక్రయించి 8.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. డిజైర్, ఎర్టిగా, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, ఫ్రాంక్స్, బ్రెజా వంటి మోడళ్లు ఈ విక్రయాల్లో కీలక పాత్ర పోషించాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థలు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ విక్రయాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియాను వెనక్కి నెట్టడం విశేషం. మహీంద్రా సంస్థ 2025 క్యాలెండర్ ఏడాదిలో అదరగొట్టింది. స్కార్పియో, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, బొలెరో, ఎక్స్‌యూవీ 700 వంటి ఎస్‌యూవీల అండతో 5,88,994 వెహికల్స్‌ను అమ్మి 20.04 శాతం వృద్ధి సాధించింది. ఆ సంస్థ ఆటోమోటివ్ విభాగం సీఈఓ నళినీకాంత్ గొల్లగుంట మాట్లాడుతూ దేశంలో ఎస్‌యూవీ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోందని తెలిపారు. బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ వంటి ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. ఈనెల ఐదో తేదీన ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ పేరుతో కొత్త మోడల్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.
మూడో స్థానంలో టాటా మోటార్స్
టాటా మోటార్స్ 5,65,982 వెహికల్స్ విక్రయాలతో 5.58 శాతం వృద్ధి సాధించి మూడో స్థానంలో నిలిచింది. నెక్సాన్, పంచ్ వంటి మోడళ్లు ఆ సంస్థకు బలాన్ని ఇచ్చాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర మాట్లాడుతూ వరుసగా ఐదో ఏడాది రికార్డు విక్రయాలు సాధించామని చెప్పారు. హ్యుందాయ్ 5,59,039 విక్రయాలతో నాలుగో స్థానానికి పడిపోయింది. క్రెటా మోడల్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. పుణె ప్లాంట్ అందుబాటులోకి వస్తే 2026లో హ్యుందాయ్ విక్రయాలు పుంజుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.
రెండోస్థానంలో మహీంద్రా
కంపెనీ 2025 సేల్స్ 2024 సేల్స్ పెరుగుదల (%)
మారుతీ సుజుకీ 17,84,788 16,40,404 8.8
మహీంద్రా 5,88,994 4,90,672 20.04
టాటా మోటార్స్ 5,65,982 5,36,046 5.58
హ్యుందాయ్ 5,59,039 5,60,687 -0.29
