తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా, కృష్ణా, గోదావరి జలాల సాధనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తెలంగాణ ప్రజల నీటి అవసరాలు తీర్చాలన్న చిత్తశుద్ధి గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో కనపడటం లేదు. తెలంగాణ రాకముందు ఆంధ్ర పాలకుల నీటి దోపిడీ గురించి మాట్లాడిన కేసీఆర్.. మరి తెలంగాణ సాధించాక పది సంవత్స రాలు రాష్ట్రాన్ని పాలించి ఏం సాధించారు? కృష్ణా జలాల కింద ఎన్ని ఎకరాలు కొత్తగా సాగులోకి తెచ్చారంటే వారి వద్ద జవాబు లేకుండా పోయింది.
అవినీతి, సాంకేతిక, రాజకీయ అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో గత పాలకులు, ప్రస్తుత పాలకులు కాలం గడుపుతున్నారు. భౌగోళికంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌కు పైన ఉన్న రాష్ట్రం అన్న సోయి కూడా వీరికి లేకపోవడం శోచనీయం. అధికారం కోసం ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి, అవి తీర్చలేక, నిధులు లేవన్న సాకులు చెపుతూ .. ప్రాజెక్టులు కట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది.
తెలంగాణ వచ్చే నాటికే 299 టీఎంసీల నికర జలాలను ప్రాజెక్టులవారీగా కేటాయింపులు ఈవిధంగా ఉన్నాయి.
- మేజర్ ప్రాజెక్టులు: నాగార్జున సాగర్ 105 టీఎంసీలు, ఆర్డీఎస్ 16 టీఎంసీలు, బీమా 20 టీఎంసీలు, జూరాల 18 టీఎంసీలు కలిపి మొత్తం 159 టీఎంసీలు ఉపయోగంలో ఉన్నాయి.
- మీడియం ఇరిగేషన్ రూపంలో కేటాయించిన నికర జలాలు : కోటిపల్లి, దిండి, కోయిల్ సాగర్, చిట్టి వాగు, మూసీ, హైదరాబాద్ తాగునీరు, పీలేరు, పాకాల, వైరా, లంక సాగర్ వంటి మీడియం ప్రాజెక్టులకు 48.24 టీఎంసీల నీళ్లు ఉపయోగంలో ఉన్నట్లు నిర్ధారించారు.
- మైనర్ ఇరిగేషన్ కింద 90.82 టీఎంసీల నికర జలాలు వాడుకుంటున్నట్టు నిర్ధారించారు. మేజర్ ఇరిగేషన్ కింద 159.94, మీడియం ఇరిగేషన్ 48.24, మైనర్ ఇరిగేషన్ కింద 90.82 టీఎంసీలు..మొత్తం కలిపి 299 టీఎంసీలు నికర జలాల రూపంలో తెలంగాణ వాడుకుంటున్నదని నిర్ధారించారు.
పెండింగ్ ప్రాజెక్టులు ఉండగా.. కేసీఆర్ సంతకమెలా పెట్టారు?
అయితే, ఉమ్మడి రాష్ట్రంలోనే నికర జలాల రూపంలో ఉపయోగంలో ఉన్న 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం చేయాల్సిన అవసరం ఏమున్న ది? ఇది అజ్ఞానమా? అతి తెలివితేటలా? ఉపయోగంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్తులో కట్టబోయే ప్రాజెక్టులకు ఎంత నీటి వినియోగం అవుతుందనే అంచనా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు- నెట్టెంపాడు 22 టీఎంసీలు, కల్వకుర్తి 25 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ 30 టీఎంసీలు కలిపి మొత్తం 77 టీఎంసీల సామర్థ్యంగల ప్రాజెక్టులను వరద జలాల కింద కట్టుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభమయ్యాయి.
ఈ ప్రాజెక్టులను 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేకపోయిందన్న దానికి వారివద్ద జవాబు లేదు. ఆంధ్రప్రదేశ్ వెలిగొండ వద్ద ట్విన్ టన్నెల్ రూపంలో 18 కిలోమీటర్లు పూర్తిచేసి, 53 టీఎంసీల రిజర్వాయర్ సిద్ధం చేసి, నీళ్లు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నది. ఇది చూసైనా బుద్ధి తెచ్చుకోని పాలకులను ఏమనాలి? వాళ్లు టన్నెల్స్ పూర్తి చేసి నీళ్లు తీసుకుపోతుంటే.. మన ఎస్ఎల్బీసీ టన్నె ల్ ఎందుకు పూర్తికాలేదు?
‘పాలమూరు– రంగారెడ్డి’ చేపట్టి పదేండ్లు
తెలంగాణలో కృష్ణానదిపై ఉన్న ఏకైక భవిష్యత్ ప్రాజెక్టు పాలమూరు– -రంగారెడ్డి. ఈ ప్రాజెక్టు కింద 120 టీఎంసీలు ఎత్తిపోసి, 12 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో 2015లోనే మొదలుపెట్టినా, ఇంతవరకు పూర్తిచేయలేదు. నీటి లభ్యత, ఇతర వివరాలను తగురీతిలో పొందుపర్చకపోవడంతో ఆ డీపీఆర్ వెనక్కు వచ్చింది. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి ఎటూ కాకుండా చేశారు. ప్రతి సంవత్సరం జూరాల మిగులు జలాలు శ్రీశైలానికి పోతున్నాయి. శ్రీశైలం వద్ద పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్క డ వేసిన గొంగడి అక్క డే అన్నట్టు ఉన్నాయి.
కృష్ణా పరీవాహకం తెలంగాణలో 69 శాతం
కృష్ణా పరీవాహక ప్రాంతంలో అధికారికంగా 69 శాతం తెలంగాణలోనే ఉంది. 31 శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాజెక్టులు కట్టుకుంది, ఇంకా కట్టుకుంటున్నది. బేసిన్ ఆవల కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తుంగభద్ర హై, లో లెవల్ కెనాల్స్ వంటి ప్రాజెక్టులు పూర్తిచేసి ఏపీ ముందుకుపోతుంటే.. మన తెలంగాణ పాలకులకు సోయి లేకుండా పోయింది.
మన నాయకులు మాత్రం ఆంధ్రా పాలకులపై విమర్శలతోనే సరిపెట్టుకొని తమ చేతకానితనాన్ని చాటుకుంటున్నా రు.
ఆంధ్ర నాయకులను విమర్శించడం కన్నా, సొంత రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఏవిధంగా పూర్తి చేయాలో ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు ఇప్పటికే మేలు జరుగేది. కట్ట కింది పొలం తెలంగాణదైతే, కొస పొలం ఆంధ్రప్రదేశ్‌ది. కానీ, తెలంగాణ వచ్చాక కూడా కట్టకింద పొలం ఎండిపోతూ, కొస పొలానికి నీళ్లు పారుతున్నాయని ఏడిస్తే.. ఒక్కక్షణం కూడా అధికారంలో ఉండకూడని బీఆర్ఎస్ పదేండ్లు ఏం చేసినట్లు? ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన మన ప్రాజెక్టులనైనా పూర్తిచేశారా?
ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీలు కేటాయింపు ఉంటే 1,150 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు కట్టారు. అంటే 350 టీఎంసీల నీటిని అధికంగా నిల్వ చేయగలిగేలా ప్రాజెక్టులు కట్టారు. అవి కూడా ఆంధ్రాప్రాంతంలోనే ఎక్కువ కట్టారు. మరి తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అవుతున్నా కనీసం ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌లో అప్పటి ఆంధ్ర పాలకులు మన ప్రాంతంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయని అసమర్థత తెలంగాణ పాలకులది కావడం మన దురదృష్టం. 10 సంవత్సరాలు పాలించి కృష్ణానదిపై ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని బీఆర్ఎస్కు మాట్లాడే హక్కు ఉందా? కాం గ్రెస్ ప్రభుత్వం కూడా కొత్త లిఫ్టు స్కీ ములు పెట్టి మరో కాళేశ్వరంలా మార్చకుండా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి.
కాకతీయులే లేకపోతే..
స్వతంత్రం రాకముందే కాకతీయుల చెరువులు తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి. కాకతీయులు 800 ఏళ్ల క్రితమే రిడ్జ్ టు వ్యాలీ సూత్రం ఆధారంగా లక్షల చెరువులు తెలుగు నేలపై నిర్మించారు. ఆ కాలంలోనే వాటర్ షెడ్స్, పాండ్స్ , రాక్ ఫిల్ కట్టడాలు, గొలుసు కట్టు చెరువులు నిర్మించి తెలంగాణ నేలను సస్యశ్యామలం చేశారు. కాకతీయుల చిత్తశుద్ధిలో పావలావంతైనా మన
పార్టీల్లో, నాయకుల్లో కనిపించదు. తెలంగాణ గీతంలో కాకతీయుల పేరు తీసివేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదం. కాకతీయులే లేకపోతే తెలంగాణకు ఉండే చరిత్ర ఏంటో చెప్పాలి.
మైనర్, మీడియం ఇరిగేషన్‌కు చెందిన 138 టీఎంసీలు వాడుతున్నామా?
కాకతీయులు నిర్మించిన లక్షకు పైగా చెరువుల్లో నేడు చాలావరకు కూరుకుపోయాయి, ఆక్రమణలకు గురయ్యాయి. ప్రధానంగా కృష్ణా బేసిన్లో మైనర్ ఇరిగేషన్ కింద 90 టీఎంసీల నికర జలాల ట్రిబ్యునల్ కేటాయింపును మనం తిరగతోడాల్సిన అవసరం ఉంది. చెరువుల ఆక్రమణల వల్ల, కూరుకుపోవడం వల్ల 90 టీఎంసీలను మనం వాడుకోవడం లేదు. ఈ 90 టీఎంసీల లెక్క సరైనది కాదని ట్రిబ్యునల్ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది.
అయితే మన ప్రభుత్వం వద్ద నీటి నిల్వ ఉండే చెరువులు, నీటి నిల్వ లేని చెరువులు, వాటి ఆయకట్టు తదితర వివరాలు లేకపోవడం విచారకరం . ఇప్పటికైనా మైనర్ ఇరిగేషన్ ఆయకట్టు పూర్తి వివరాలతో రూపొందించాలి. మీడియం ఇరిగేషన్ ఆయకట్టు కింద కేటాయిం చిన 48 టీఎంసీలను కూడా వాడుకోవడం లేదు. మీడియం ఇరిగేషన్ ఆయకట్టు కూడా తగ్గిపోయింది. ప్రాజెక్టుల వారీగా కాకుండా నది బేసిన్ ఏరియా లెక్కగా కేటాయింపులు జరిపేలా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తేవాలి.
మన తెలంగాణ పాలకుల్లో తెగింపు ఏది?
జలయజ్ఞంలో చేపట్టిన చాలా ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు లేవు. కానీ పని మొదలుపెట్టుకొని పూర్తిచేసుకున్నారు. అది ఆంధ్ర పాలకుల తెగింపు. మరి మన పాలకులకు ఎందుకు ఆ తెగింపు లేదు? ఇప్పటికైనా రాష్ట్రానికి సమగ్ర వ్యవసాయ విధానం , పం టల మార్పి డి, వాటికి కావల్సి న విద్యుత్, నీటి అవసరాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. కొత్త ప్రాజెక్టులు కాకుం డా నిర్మా ణంలో ఉన్న ప్రాజెక్టులు ముందు పూర్తి చేయాలి. ప్రభుత్వం మారినప్పుడు ప్రాజెక్టుల డిజైన్లు, లొకేషన్లు మార్చడం వల్ల తెలంగాణ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.
కాళేశ్వరం, పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టులు దీనికి ఉదాహరణ. తరాలు మారినా మన తెలంగాణ తలరాత మారడం లేదు. ప్రజలే చైతన్యవంతులై గత, ప్రస్తుత ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి తన నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది.
కృష్ణాజలాల్లో మన ప్రాజెక్టులకు 540 టీఎంసీలు అవసరం
పాలమూరు ప్రాజెక్టు ప్రారంభంలో పల్లేరు కాయలు కాసే నేల పన్నీ రు అవుతుం దన్న కేసీఆర్ మాటలు పనికిరాని మాటలుగానే మిగిలిపోయాయి. కృష్ణా నదిపై నెట్టెంపాడు 22 టీఎంసీలు, కోయిల్ సాగర్ 5 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ 40 టీఎంసీలు, కల్వ కుర్తి 53 టీఎంసీలు, పాలమూరు దిండి కలిపి 120 టీఎంసీలు మొత్తం 240 టీఎంసీల నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి న అవసరం రాష్ట్రానికి
ఉం ది.
నికర జలాల రూపంలో 299 టీఎం సీలు, ఇంకా కట్టుకున్న ప్రాజెక్టులకు 241 టీఎంసీలు కలిపి 540 టీఎంసీలు తెలంగా ణకు అవసరం. ఈ లెక్కలు అప్పట్లో కేసీఆర్‌కు ఎందుకు అర్థం కాలేదు? ఇప్పటి పాలకులకు ఏమేరకు అర్థమైంది? రాజకీయాలకు అతీతంగా పోరాడి తెలంగాణ 540 టీఎంసీలు సాధించుకోవాల్సిందే!
- నరహరి వేణుగోపాల్ రెడ్డి,
బీజేపీ సీనియర్ నాయకులు
