
పల్లెలు ఎంత పరిశుభ్రంగా ఉంటే ప్రజలు అంత ఆరోగ్యంగా ఉంటారు. గ్రామాలు నీట్‌గా ఉండాలంటే ఓపెన్ డిఫకేషన్ లేకుండా చేయటమే మార్గం. ప్రతి ఇంట్లో టాయిలెట్, బాత్రూమ్ కట్టించినంతమాత్రాన సాధ్యపడదు. వాటికి పైపుల ద్వారా నీళ్ల సరఫరా ఉండాలి. డ్రైనేజీలను కూడా పక్కాగా నిర్మించాలి. ఇంటింటికీ నల్లా ద్వారా అవసరమైనన్ని నీళ్లు అందించాలి. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ వంద శాతం సక్సెస్ కోసం కేంద్రం మిషన్ పానీ కార్యక్రమం ప్రారంభించింది.
ఓ 30–35 ఏళ్ల క్రితం బాలచందర్ ‘తన్నీర్ తన్నీర్’ సినిమా తీశారు. గ్రామాల్లో నీటి ఎద్దడిపై తీసింది. ఒక స్కూలులో మాస్టారు రోజూ స్నానం, ఒంటి శుభ్రతపై పాఠం చెబుతుంటాడు. ఒక పిల్లాడు లేచి, ‘తాగడానికే నీళ్లు లేవు కదా సార్! రోజూ స్నానం వీలవుద్దా?’ అంటాడు. ఇన్నేళ్లలో కేంద్రంలో కనీసం తొమ్మిది ప్రభుత్వాలు మారిపోయాయి. ల్యాండ్ లైన్ ఫోన్ కోసం ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్టులో ఉండే జనాలకు ఇప్పుడు చిటికెలో మొబైల్ కనెక్షన్ దొరుకుతోంది. ఇల్లు కదలకుండా బిల్స్ కట్టడం, రైలు టిక్కెట్లు బుక్ చేయడం, బ్యాంక్ మొహం చూడకుండా లావాదేవీలు జరపడం వగైరా డెవలప్మెంట్ చాలా సాధించింది ఇండియా. కానీ, తన్నీర్ తన్నీర్ రోజులనాటి నీటి ఎద్దడి, ఒంటి శుభ్రత, ఓపెన్ మరుగుదొడ్ల సమస్య మాత్రం చాలా గ్రామాల్లో అలాగే ఉంది.
ఇక, దేశవ్యాప్తంగా పల్లెల్లోని 93 శాతం ఇళ్లలో టాయిలెట్ సదుపాయాలు ఉన్నాయని, వాటిని 96 శాతం మంది ఉపయోగిస్తున్నారని ఇటీవల సర్కారు పరిశీలనలో తేలింది. 2018–19లో జరిగిన ‘నేషనల్ యాన్యువల్ రూరల్ శానిటేషన్ సర్వే’ ఈ విషయాన్ని తెలిపింది. గ్రామాల్లో ‘స్వచ్ఛ భారత్ మిషన్’ కవరేజీని, టాయిలెట్ల వాడకాన్ని పలు స్టడీలు, ఫీల్డ్ రిపోర్టులు విశ్లేషణ చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మైక్రో లెవల్ అసెస్మెంట్లకు, ఈ సర్వేలోని అంశాలకు మధ్య కొంత తేడా వచ్చింది.
‘అలా ఎందుకు జరిగింది?’ అనే ప్రశ్న తలెత్తింది. దీనికితోడు పరిశుభ్రతపై ప్రజల, పాలకుల ఆలోచనలపై ఏకాభిప్రాయం లేదు. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ 100 శాతం సక్సెసయి ఉంటే… శానిటేషన్ సంబంధ రోగాలు రాకూడదు. పరిశుభ్రత లేకపోవడంతో జనం ఇప్పటికీ క్వాలిటీ లైఫ్‌ను పొందలేకపోతున్నారని సర్వే గుర్తు చేసింది. దీనిపై సెంట్రల్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మినిస్ట్రీ కొన్ని గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అన్ని ఊళ్లనూ ‘బహిరంగ మల విసర్జన లేని’ (ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ–ఓడీఎఫ్) ప్రాంతాలుగా మార్చటానికి ఉపయోగపడే సలహాలు ఇచ్చింది. స్వచ్ఛ భారత్ మిషన్‌ని ప్రెస్టేజీగా భావిస్తున్న మోడీ రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడంతో ఈ మిషన్‌ని మరింత పక్కాగా అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విలేజ్ లెవెల్లో అమలు చేయటంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి.
సేఫ్ శానిటేషన్‌పై ప్రచారం
ఒడిశాలోని రూరల్ ఏరియాల్లో 1994 నుంచి 2019 వరకు అమలుచేస్తున్న ‘గ్రామ్ వికాస్’ కార్యక్రమంలో ఎదురైన అనుభవాలను బట్టి ఆ ఇబ్బందులను వివరించొచ్చు. సేఫ్ శానిటేషన్‌పై ప్రచారం చేశారు. జనం నెమ్మదిగా దానికి అలవాటు పడుతున్నా… టాయిలెట్లు ఉపయోగించాలంటే సమృద్ధిగా నీళ్లు అవసరమన్న విషయాన్ని మొదట్లో గుర్తించలేదు. ‘గ్రామ్ వికాస్’లో భాగంగా పల్లెల్లోని వంద శాతం ఇళ్లలో ఇంటిగ్రేటెడ్ వాటర్, శానిటేషన్, హైజీన్ (డబ్ల్యూఎస్‌హెచ్)లో మార్పు తేవాలని టార్గెట్ పెట్టుకున్నారు.
టాయిలెట్లు, బాత్రూమ్లు కట్టించి, వాటికి పైపుల ద్వారా నీళ్లు సప్లై చేయాలని భావించారు. మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది బెస్ట్ ప్రాక్టీస్‌గా గుర్తింపు పొందింది. పాతికేళ్ల క్రితం మొదలెట్టిన గ్రామ్ వికాస్ ప్రోగ్రాంని ఈ ఏడాది మార్చి 31 నాటికి 1,400లకు పైగా గ్రామాల్లోని దాదాపు 90 వేల ఇళ్లలో అమలు చేశారు. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలకు ఆర్థిక సాయాన్ని బేసిక్‌గా ప్రభుత్వ పథకాల ద్వారా అందించారు.
‘టోటల్’ మార్పు కోసం..
గవర్నమెంట్ కొత్తగా ‘టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్’ను ప్రారంభించింది. 1999–2007 మధ్య కాలంలో ప్రజలకు శానిటేషన్ సదుపాయాల నిర్మాణంలో ఆర్థికంగా తోడ్పాటు లభించింది. బీపీఎల్ కుటుంబాలకు ఇంటికి రూ.300 చొప్పున ఇచ్చారు. కమ్యూనిటీల ఆధ్వర్యంలోని పైప్డ్ వాటర్ సప్లై ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ సపోర్ట్ కొంచెం ఆలస్యంగా దొరికింది. 2003లో ‘స్వజల్ధార’ పథకాన్ని ప్రారంభించటంతో గ్రామాల్లో శానిటేషన్ పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే, ఆ సదుపాయాలు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. అందువల్ల వాటి రిపేర్, అప్‌గ్రెడేషన్ కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ కొనసాగించాల్సిందే.