హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అడుగు కిందికి నీటి మట్టాలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అడుగు కిందికి నీటి మట్టాలు
  •     వచ్చే నెలలో మరింత తగ్గే అవకాశం ఉందంటున్న అధికారులు
  •     వేసవి మొదట్లోనే ఎండిపోతున్న బోర్లు
  •     ఇండ్లలోని మోటార్లను లోతుకు దించుతున్న జనం
  •     మేడ్చల్ – మల్కాజగిరి జిల్లాలో కాస్త బెటర్​

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే ఫిబ్రవరి నాటికి ఈసారి గ్రౌండ్​వాటర్ లెవల్స్ తగ్గాయి. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో కాస్త బెటర్​గా ఉన్నాయి. మూడు జిల్లాల్లో మండలాల వారీగా 52 ప్రాంతాల్లో పరిశీలించగా 37 ప్రాంతాల్లో నీటిమట్టాలు పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. 15 చోట్ల మాత్రమే కిందటేడు కంటే పెరిగాయి. హైదరాబాద్ జిల్లాలో 10 ప్రాంతాల్లో చెక్​చేయగా అన్నిచోట్ల పడిపోయినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో 20 మండలాల్లో తగ్గాయి.

మేడ్చల్– మల్కాజిగిరిలోని 7 మండలాల్లో పడిపోయాయి. అలాగే జనవరితో పోలిస్తే మూడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మీటర్, రెండు మీటర్ల చొప్పున కిందికి వెళ్లాయి. రెండు నెలలుగా నీటి మట్టాలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్​జిల్లా వ్యాప్తంగా చూస్తే సగటున 1.07 మీటర్ల మేర, రంగారెడ్డి జిల్లాలో సగటున 0.64  మీటర్ల మేర తగ్గాయి. మేడ్చల్-– మల్కాజిగిరి జిల్లాలో మాత్రం సగటున 0.57 మీటర్లు పైకి వచ్చాయి. ప్రాంతాల వారీగా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 4.07 మీటర్ల మేర నీటి మట్టాలు పడిపోయాయి.

గతేడాది ఫిబ్రవరిలో ఇక్కడ 8.62 మీటర్ల లోతులో నీరు ఉండగా, ప్రస్తుతం 12.69 మీటర్ల లోతులోకి చేరింది. గండిపేట, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, సరూర్ నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, అమీర్ పేట, ఉప్పల్, ఘట్ కేసర్ తదితర ప్రాంతాల్లో నీటిమట్టాలు 2 నుంచి 4 మీటర్ల లోతుకు పడిపోయాయి. దుండిగల్ లో మాత్రం నీటిమట్టాలు భారీగా పెరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో ఇక్కడ 19.93 మీటర్ల లోతులో నీటిమట్టాలు ఉండగా, ప్రస్తుతం 13.47 మీటర్లకు చేరాయి.

జనవరి నుంచి తగ్గు ముఖం

భూగర్భ జలాలు తగ్గుతుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో జనం మోటార్లను మరింత లోతుకు దించుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో బోర్లను కిందికి దించారు. పోయినేడు సరిపడా నీళ్లు ఉండడంతో సమ్మర్ లో బోర్లు ఎండిపోలేదు. ఎండలు పెరగక ముందే ఈసారి బోర్లు ఎండిపోతుండడంతో జనం అప్రమత్తం అవుతున్నారు. గతేడాదంతా బాగానే ఉన్నా ఈ ఏడాది జనవరి నుంచి ఒక్కసారిగా వాటర్​లెవల్స్​తగ్గుముఖం పట్టాయి. వచ్చే నెలలో సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

పొదుపుగా వాడుకోవాలి

వర్షాలు కురిసినప్పుడు నీటిని భూమిలోకి ఇంకించే ప్రయత్నం చేయాలి. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలాచోట్ల నీటిమట్టాలు తగ్గాయి. ఎండలు ముదిరితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. నీటిని వృథా చేయొద్దు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - పి.రఘుపతి రెడ్డి, డిప్యూటీ డైరక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్, రంగారెడ్డి జిల్లా