గ్రావిటీతోనే నీళ్లొస్తయి..చెన్నూర్​ ఎత్తిపోతలెందుకు?

గ్రావిటీతోనే నీళ్లొస్తయి..చెన్నూర్​ ఎత్తిపోతలెందుకు?

గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు ఎదురు ఎత్తిపోతల బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల జలాశయాల తీరం ఒడ్డునే చెన్నూర్ నియోజకవర్గం ఉంటుంది. చెన్నూర్ ప్రాంతానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి లక్షా 20 వేల ఎకరాలకు నీళ్లు అందించేందుకు రూ.1658 కోట్ల సాగునీటి పథకం మంజూరైంది. దీనికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు కూడా వచ్చాయి. భూసేకరణ మొదలు కాలేదు. రైతుల బీళ్లకు సాగు నీళ్లివ్వడం మంచి విషయమే. మేడిగడ్డ ప్రాణహిత బ్యాక్​వాటర్ నుంచి కోటపల్లి మండలం ఆల్గాం వద్ద ఒక ఎత్తిపోతలు, అన్నారం బ్యారేజీ నుంచి చెన్నూర్​ మండలం పొక్కూర్​గ్రామంలో మరొక ఎత్తిపోతలు, సుందిళ్ల బ్యారేజీకి జైపూర్​మండలం షెట్పల్లి గ్రామంలో ఇంకో ఎత్తిపోతలు ఇలా.. మూడు చోట్ల మూడు ఎత్తిపోతలు ప్రతిపాదించారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోనే అత్యంత లోతట్టు ప్రాతం చెన్నూర్ గ్రావిటీ పథకాలను సీఎం కేసీఆర్ త్వరలో​శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో వాటి అవసరాన్నీ, ప్రత్యామ్నాయాలను ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.

రూ.1658 కోట్లతో..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 45 ఏండ్లలో అన్నిపార్టీల ప్రభుత్వాలు పోటీలుపడి వంద ఎత్తిపోతలు నెలకొల్పారు. అవన్నీ నేడు ఉత్తపోతలయ్యాయి. ఉమ్మడి జిల్లాకు దక్షిణాన గోదావరి 290 కిలోమీటర్లు, ఉత్తరాన పెన్ గంగ162 కిలోమీటర్లు, వార్ధానది ఉత్తరాన 70 కిలోమీటర్లు, తూర్పున ప్రాణహిత113 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తాయి. పశ్చిమం తప్ప ఉమ్మడి జిల్లాకు సరిహద్దుల్లో బయట అన్నివైపుల 635 కిలోమీటర్ల పొడవున నదులు ప్రవహిస్తాయి. జిల్లాలో ఉపనదుల్లాంటి భారీవాగులు ప్రధాన నదుల్లో కలుస్తాయి. ఇవన్నీ వేర్వేరు చోట్ల కలిసి చెన్నూర్ కాళేశ్వరం మధ్య గోదావరిలో చేరతాయి. సముద్రమట్టానికి 624 మీటర్ల ఎత్తున కొండపోచమ్మ సాగర్, 550 మీటర్ల ఎత్తున మల్లన్నసాగర్ వలె కాదు చెన్నూర్ ప్రాంతం. అద్భుతమైన లోతట్టు గ్రావిటీ ప్రాంతం. ఉమ్మడి ఆదిలాబాద్​లో పడ్డ ప్రతి నీటి చుక్క, ఉమ్మడి కరీంనగర్, నిజమాబాద్ మరికొన్ని జిల్లాల గోదావరి రిడ్జ్ ప్రాంతంలో ఎక్కడ చినుకులు పడ్డా చెన్నూర్ లోతట్టు మట్టిని ముద్దాడకుండా సముద్రాన్ని చేరవు. కుష్టి నుంచి1130 అడుగులు, శ్రీరాంసాగర్ నుంచి 793 అడుగులు, న్యూ సదర్ మాట్ నుంచి 660 అడుగులు, కడెం నుంచి 400 అడుగులు, ఎల్లంపల్లి నుంచి185 అడుగుల దిగువ జలపాతపు వాలులో ఉన్న చెన్నూర్ ప్రాంతానికి నీళ్లెందుకు గ్రావిటీతో రావు? ప్రాణహితతో పాటు ఏడు విధాల గ్రావిటీ ప్రత్యామ్నాయాలు ఉండగా.. కండ్లముందే ఉత్తపోతలవుతున్నా, మళ్లీ రూ.1658 కోట్ల ఎత్తిపోతలు ఎందుకు?

ఏడు ప్రత్యామ్నాయాలు

కుంటాల జలపాతం ఎగువన కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తామని తొలి ప్రమాణస్వీకారం ప్రారంభ ఉపన్యాసంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. కుష్టినది బెడ్ లెవెల్1430 అడుగులు. చెన్నూర్ వద్ద గోదావరి బెడ్ వెల్300 అడుగులు. కుష్టినది కంటే చెన్నూర్1130 అడుగుల దిగువన అద్భుతమైన దిగువ వాలు గ్రావిటీలో ఉంది. అయితే కుప్టి డీపీఆర్ పూర్తయినా విడుదల చేయలేదు. ప్రభుత్వం దాచి పెట్టింది.

 శ్రీరాంసాగర్ పూర్తి నీటి మట్టం ఎత్తు 1093 అడుగులు. శ్రీరాంసాగర్ నుంచి 793 అడుగుల దిగువన చెన్నూర్ మంచి గ్రావిటీలో ఉంది. శ్రీరాంసాగర్ నుంచి కాకతీయ కాలువ గుండా మంథని ప్రాంతం ఉపకాలువ(డి-83) ద్వారా పంటలకు చేరిన మిగులు నీరు ప్రతీచుక్క చెన్నూర్ గోదావరికే చేరుతాయి. శ్రీరాంసాగర్ నీరు గోదావరి కుడిగట్టు మంథనికి వచ్చినప్పుడు, నెహ్రూ డిజైన్ చేసిన ఉత్తర కాలువతో 60 ఏండ్లయినా చెన్నూరుకు నీళ్లు ఎందుకు రావు? 

 శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ ఎత్తు1010 అడుగులు, కడెం పూర్తి నీటిమట్టం ఎత్తు 700 అడుగులు. శ్రీరాంసాగర్ కంటే కడెం 310 అడుగుల దిగువవాలులో ఉంది. మరి కాకతీయ కాలువకు సమాంతరంగా కాలువను కడెం వరకు చెన్నూర్ నీళ్ల కోసం నిర్మించవచ్చు. నెహ్రూ కాలంలో డిజైన్ పూర్తయిన 2వ దశ ఉత్తర కాంటూర్ కాలువతో  కాసిపేట, బెల్లంపల్లి, నెన్నల మండలాలతో పాటు మరియు చెన్నూర్ నియోజకవర్గంలోని  ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు.

శ్రీరాంసాగర్ నెహ్రూ గోదావరి నార్త్ కెనాల్ ప్రాజెక్ట్ (జీఎన్సీపీ(కడెం)2వ దశ) లేదా ఎన్టీఆర్ మందాకిని కాలువ ద్వారా చెన్నూర్ ప్రాంతానికి పూర్తి గ్రావిటీతో నీరందించవచ్చు. ఖానాపూర్ సదర్ మాట్ ఎగువన మామడ మండలం పొన్కల్ గ్రామం వద్ద 20 టీఎంసీల న్యూ సదర్​మాట్ బ్యారేజీ నిర్మాణం చివరలో ఉంది. నీటిమట్టం ఎత్తు 960 అడుగులు. న్యూ సదర్ మాట్ నుంచి చెన్నూర్ 660 అడుగుల దిగువన ఉంటుంది. ఖానాపూర్ నియోజకవర్గంలోని పాత సదర్​మాట్ ఆయకట్టు రక్షణకు నిర్మిస్తున్నారు. సదర్ మాట్ కాలువ చివరలో కడెం ప్రాజెక్టు ఉంటుంది. ఆ కాలువ సామర్థ్యాన్ని పెంచితే కడెంకు నీరొస్తుంది. అలా ఉత్తర కాలువ రెండోదశ ద్వారా చెన్నూర్ ప్రాంతానికి 

గ్రావిటీతో నీరందించవచ్చు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు(20 టీఎంసీల) నిర్మాణం పూర్తయి పదేళ్లు దాటింది. దీని పూర్తి నీటిమట్టం ఎత్తు 485 అడుగులు. ఎల్లంపల్లి కంటే చెన్నూర్185 అడుగుల దిగువన ఉంటుంది. చెన్నూర్ నియోజకవర్గానికి ఎల్లంపల్లి ద్వారా నీరందించవచ్చు. ప్రతి చెరువుకు రెండు కాలువలుంటాయి. ఎల్లంపల్లికి దక్షిణం వైపు గ్రావిటీతో నీరు వెళ్లదు. దక్షిణం వైపన్నీ ఎత్తిపోతలే. చెన్నూర్ ప్రాంతం185 అడుగుల దిగువ వాలులో ఉంటే ఎల్లంపల్లికి ఉత్తరానికి ఎందుకు కాలువ పెట్టలేదు? ఎల్లంపల్లి నుంచి 624 మీటర్ల గజ్వేల్ కు, 550 మీటర్ల సిద్దిపేటకు, ఎంతో ఎత్తు ఉన్న రిజర్వాయర్లకు భారీఖర్చుతో ఎదురెక్కి ఎందుకు పోవాలి? 185 అడుగుల దిగువనున్న చెన్నూర్​కు నిర్మాణం తప్ప పైసా ఖర్చులేకుండా పల్లమెరుగు గ్రావిటీతో నీళ్లు ఎందుకు రావు? యుద్ధ ప్రాతిపదికన ఎల్లంపల్లి నుంచి చెన్నూర్ గ్రావిటీ కాలువ సర్వే, నిర్మాణం కోసం పూనుకోవాలి.

చివరి ముఖ్యమైన ప్రత్యామ్నాయం ప్రాణహిత తుమ్మిడిహెట్టి నుంచి 72 కి.మీ. గ్రావిటీ కాలువ నిర్మాణమైంది. జైపూర్ వాగుగుండా పూర్తి గ్రావిటీతో  సుందిళ్లకు చేరుతుంది. లేదా తుమ్మిడిహెట్టి కాలువ స్వల్ప ఎత్తిపోతలతో ఎల్లంపల్లికి చేరుతుంది. కాలువ బ్యారేజీ మొత్తం ఖర్చు రూ.5 వేల కోట్ల పైన. నెహ్రూ(ఎన్టీఆర్ మందాకిని), కేసీఆర్ ప్రస్తావించిన అదే కాలువకు అనేకచోట్ల కలుపవచ్చు. ఇలా చెన్నూర్ ప్రాంతంలోని ప్రతి అడుగు నేలకు ఏదో ఒకరోజు ఉత్తపోతలయ్యే ఎత్తిపోతల నీళ్లు గాక, శాశ్వత గ్రావిటీ పారకపు నీరు ఇవ్వచ్చు. తుమ్మిడిహెట్టి నుంచి సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపెల్లి, మంచిర్యాల నియోజకవర్గాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వొచ్చు. వీటిగుండా 70 శాతం కాలువ పూర్తయింది. కాళేశ్వరం కంటే తక్కువ ఖర్చుతో మల్లన్న సాగర్, కొండపోచమ్మలకు కూడా నీరు ఇవ్వొచ్చు.

ఎత్తిపోతలన్నీ మూలకు..

వైఎస్సార్​ రెండోసారి సీఎంగా  ఉన్న సమయంలో చెన్నూర్ నియోజకవర్గంలో వెంచెపెల్లి, సిర్స, అర్జునగుట్ట, బోరాంపెల్లి, సుందరశాల, నర్సక్కపేట, సోమన్​పల్లి, శివారం ఎల్ మడుగు, కిష్టాపూర్, బెజ్జాల, షెట్పల్లి గ్రామాల్లో మొత్తం11 ఎత్తిపోతలు గోదావరి, ప్రాణహిత నదులపై నెలకొల్పారు. వీటితో 25 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. ట్రయల్ రన్ పూర్తయి ఐదేండ్లు దాటినా, బోరాంపెల్లి ఒక్క లిఫ్టే సాలుకు  2 సార్లు చెరువులకు నీళ్లు ఇచ్చుడు తప్ప 10 ఎత్తిపోతలన్నీ తుప్పుపట్టి నడవడం లేదు. వాటిని పట్టించుకోకుండా మళ్లీ రూ.1658 కోట్లతో ఎత్తిపోతలు ఎందుకు? పక్కనే ప్రాణహిత, పెన్ గంగపై 7 ఎత్తిపోతలు మూలకుపడ్డాయి. సీఎం కేసీఆర్ ప్రారంభించిన గూడెం ఎత్తిపోతలు గత  8 ఏండ్లలో 55 సార్లు విఫలమైంది. ఎత్తిపోతలు పెట్టే నాడున్న శ్రద్ధ.. వాటి నిర్వహణలో ఉండనే ఉండటం లేదు.  ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్ నివేదికలు ఉమ్మడి ఆదిలాబాద్ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో మొట్టమొదటిదని ఘోషిస్తున్నాయి. అనేక సవాళ్ల ఎత్తిపోతలతో మరింత వెనుకబాటుతనంలోకి కాకుండా, గ్రావిటీ పల్లమెరుగు నీళ్లతో, సీఎం కేసీఆర్ చెన్నూరు ప్రజల గతిని మార్చాలి.

నైనాల గోవర్థన్, తెలంగాణ జల సాధన సమితి