వయనాడ్ ఘటన: 163 కి చేరిన మృతుల సంఖ్య

వయనాడ్  ఘటన: 163 కి చేరిన మృతుల సంఖ్య

మరో వైపు  కేరళ వయనాడ్ లో మృతుల సంఖ్య పెరుగుతోంది.  ఇప్పటి వరకు  మృతుల సంఖ్య  151కు చేరింది. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతంలో రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మెప్పాడితో పాటు ఇతర ప్రాంతాల్లో NDRF, కేరళ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లు దాదాపు 600 మంది సహాయక చర్యలు చేస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు  ప్రయత్నిస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది.  ఇక  దాదాపు వెయ్యి మందిని రక్షించి, పునరావాస కేంద్రాలకు తరలించామని సైన్యం తెలిపింది. 

మండకై ప్రాంతంలోని టీ, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు  బెంగాల్, అసోం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు. వీరిలో 600 మంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. వీరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళలో మరో 2, 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. వయనాడు జిల్లాలో వర్షం కురుస్తోంది. మరో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు కేరళ సర్కార్ 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. తిరువనంతపురంలో అసెంబ్లీలో జాతీయ జెండాను సగం వరకు ఎగరేశారు.  ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు వయనాడ్ మృతులకు సంతాపం తెలిపారు. 

మరోవైపు అరేబియా సముద్రం వేడెక్కడంతోనే కేరళలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. చాలా తక్కువ టైంలో దట్టమైన మేఘాలు  ఏర్పడడంతో వయనాడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. అవి వరద పోటెత్తడానికి, కొండ చరియలు విరిగిపడడానికి కారణమయ్యాయని తెలిపారు. 

కేరళ వయనాడులో పరిస్థితి దారుణంగా ఉందన్నారు AICC చీఫ్  మల్లికార్జున ఖర్గే. పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారుని చెప్పారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ త్వరలో వయనాడు వెళ్తున్నారని వివరించారు. కేంద్రం కూడా వయనాడు బాధితులకు అండగా ఉండాలని కోరారు. 

కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడడాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా. కేంద్రం జాతీయ విపత్తు నిధి నుంచి డబ్బులు మంజూరు చేయాలన్నారు. కేరళలో విధ్వంసం భారీగా ఉందని చెప్పారు.