వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి : మంత్రి శ్రీధర్ బాబు

వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి : మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: కేరళలోని వయనాడ్ లో ప్రకృతి సృష్టించిన విలయంతో తీవ్ర విషాదకర పరిస్థితులు నెలకొన్నందున కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. దీనిని కేవలం ఓ రాష్ట్ర సమస్యగా చూడకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టి, అక్కడి ప్రజలను ఆదుకోవాలని ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

 వయనాడ్ విపత్తును కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేయాలని చూస్తే జాతి క్షమించదని హెచ్చరించారు. దక్షిణాదిలో ఇటువంటి ఘటన గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని తెలిపారు. 350 మందికి పైగా దుర్మరణం పాలైన వయనాడ్ విలయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంతో చూడాలని సూచించారు. అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ తో కొండ చరియలు విరిగిపడటం, వర్షపు నీటితో బురద కలిసి ప్రవాహించే సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలకు సంబంధించి ఒక మాన్యువల్ రూపొందిచాలని ఆయన కోరారు.

 ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించి కొండ చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు. వాతావరణ శాఖ ఇచ్చే ఆరెంజ్, రెడ్ అలెర్టులతో ప్రమాదాలను అంచనా వేయలేమని ఉపగ్రహాల చిత్రాల ద్వారా ఖచ్చితత్వంతో కూడిన హెచ్చరికలను జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. భూకంప ప్రాంతాలను జోన్లుగా విభజించినట్టే కొండ చరియలు కుప్పకూలే అవకాశాలున్న ప్రదేశాలను కూడా కేటగిరీల వారిగా గుర్తించాలన్నారు. రుతుపవనాల సమయంలో ఆ ప్రాంతాల్లో సహాయక బృందాలు నిరంతరం అందు బాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.