విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేదెలా?

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేదెలా?

2021లో దేశవ్యాప్తంగా 13వేల మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక గణాంకాలు చెపుతున్నాయి. తెలంగాణ బాసర ఐఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు చూస్తున్నాం. అనేక విద్యాసంస్థల్లోనూ విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు వింటూనే ఉన్నాం. రాజస్థాన్​లోని కోటాలో  ఐఐటి జేఈఈ పరీక్షకు శిక్షణ పొందుతున్న 18 ఏళ్ల విద్యార్థి  తా జాగా బలవన్మరణానికి పాల్పడడంతో  ఆ నగరంలో గడచిన 15 రోజుల్లో  ఆత్మహత్యకు పాల్పడిన నాలుగో విద్యార్థి ఇతను కావడం అత్యంత విచారకరం. 

భారతదేశ కోచింగ్ క్యాపిటల్ గా వాసికెక్కిన  కోటాలో  జనవరి నుంచి ఆగస్టు 2023 మధ్యన 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినారంటే  దానికి కారణాలను మనం సులభంగా ఊహించవచ్చు.  తెలంగాణతో పాటు భారతదేశంలోని  అనేక రాష్ట్రాల్లోనూ విద్యార్థుల ఆత్మహత్యలు గణనీయంగా  జరగడాన్ని సామాజిక, ఆర్థిక, మానసిక  ప్రాధాన్యత గల విషయంగా ప్రభుత్వ వర్గాలు, మేధావులు, మానసికవేత్తలు, తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది . 

విద్యార్థుల ఆకాంక్షలు సమర్థతను పరిగణనలోకి  తీసుకోకుండా తల్లిదండ్రుల కోరికలను  పిల్లల పైన బలవంతంగా రుద్దే దుష్ట సంప్రదాయం వలన కూడా ఈ ఆత్మహత్యలు మరిన్ని పెరుగుతున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి,  విద్యాసంస్థల ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థల యొక్క  ర్యాంకులకై ఆరాటంతో  పిల్లల పైన చేస్తున్న  ఫోర్స్,  మేధావుల  అధ్యయనాలను పట్టించుకోని ప్రభుత్వం,  శాస్త్రీయ దృక్పథాన్ని విద్యారంగం పట్ల అన్వయించకుండా గుడ్డిగా మార్కులను ర్యాంకులను సాధించడం కోసమే  ఆరాటపడుతున్న  తీరును సమర్ధించే ప్రభుత్వ విధానం కూడా  విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నది.

విద్యార్థులను ఎలా అర్థం చేసుకోవాలి ?

పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల పార్లమెంటులో  ప్రవేశపెట్టిన తన నివేదికలో  విద్యార్థుల మరణాలు  రోజురోజుకు పెరిగిపోతుంటే ఎవరూ పట్టించుకోవడంలేదని  సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని  తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది.  అదే సందర్భంలో  ముఖ్యంగా పోటీ పరీక్షలలో విఫలమైన విద్యార్థులలో  ఆత్మ స్థైర్యాన్ని పెంచే విధంగా  టెలిఫోన్ కౌన్సెలింగ్​ విధానాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచాలని కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు  స్థాయీ సంఘం సూచించినట్లుగా తెలుస్తున్నది.  అంతేకాదు మానసిక ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచాలని  తల్లిదండ్రుల ఆశల బరువును మోయవలసి వస్తున్న దుస్థితి నుంచి పిల్లలందరిని   విముక్తి చేయాలని స్థాయీ సంఘం సూచించినట్లుగా తెలుస్తుంది. 

తీసుకోవలసిన చర్యలు 

గతంలో యశ్పాల్ కమిటీ  పుస్తకాల భారాన్ని తగ్గించాలని సూచించినప్పటికీ  ఆ సిఫారసును ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదు . అలాగే కామన్ స్కూల్ విధానం ద్వారా కూడా సమానత్వ భావన,  కలయిక ప్రేమానురాగాలు,  సోదర భావం పెరుగుతుందని, విద్యపై పాఠశాలలపై సమాజం యొక్క శ్రద్ధ  కారణంగా కూడా విద్యార్థులలో  వికాసం  సాధ్యమవుతుందని  కొఠారి కమిషన్ సూచించినప్పటికీ  కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విద్యార్థులు ప్రాథమిక మాధ్యమిక తరగతుల్లో తమ వయస్సు  శరీర బరువుకు మించి  పుస్తకాల భారాన్ని మోస్తున్నట్లు ఇటీవల అధ్యయనంలో  ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా పట్టించుకోకపోతే ఎలా?పుస్తకాల భారాన్ని తగ్గించాలి.  పోటీ పరీక్షలు సాధారణ పరీక్షల విషయంలో కూడా వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే విధంగా ఆలోచన వివేచన   వంటి లక్ష్యాలను సాధించే విధంగా పరీక్షలను  మార్చవలసిన అవసరం ఉంది . 

కేవలం బట్టీ పట్టే విధానంతో  జ్ఞాపకశక్తి  తేడాలతో పాటు పోటీ పరీక్షలు  విఫలం కావడం వల్ల కూడా విద్యార్థులు ఆత్మన్యూనతకు గురవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.  మానసిక స్థితిని ఎప్పటికప్పుడు  పరిశీలించి సమస్యల  పైన విశ్లేషణ కొనసాగించి  మానసిక నిపుణుల సలహా ప్రకారంగా  వారిని  కళాశాలల, పాఠశాల యాజమాన్యాలు చూసుకునే విధంగా ఏర్పాట్లు జరగాలి. అదే సందర్భంలో తల్లిదండ్రులు కూడా  ఒత్తిడి తగ్గించి ప్రేమలు పంచి  పిల్లల  ఇష్టాల మేరకే ఎంపిక చేసుకునే వీలు కల్పించాలి. అభ్యసనం, పరిశీలన, అవగాహన, విశ్లేషణ వంటి దీర్ఘకాలిక విస్తృత  ప్రయోజన పద్ధతిలో మూల్యాంకన విధానం  అమలు చేస్తే  పిల్లలు మరింత ఉత్సాహంగా పాల్గొంటారు, రాణిస్తారు. ఇదే అభిప్రాయాన్ని ఆచార్య  ఎం ఎం సలోలకే  కమిటీ  సూచించింది.  

కొన్ని దేశాల్లో..

కొన్ని దేశాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా స్వీడన్, ఐర్లాండ్, ఎస్టోనియా వంటి దేశాలలో  వారి వారి దేశ విద్యా విధానాన్ని సంస్కరించుకొని  గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే విధంగా విద్యార్థులను తయారు చేస్తున్న  అభ్యసన విధానాన్ని  గమనించినప్పుడు  అదే అభ్యసన విధానాన్ని కూడా భారతదేశంలో అమలు చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటే  విద్యార్థులు  మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే నిపుణులుగా వెలుగొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది . ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని  ముఖ్యంగా పిల్లల్లోపల మనం నింపగలిగితే  ఇక నిర్ణయం తీసుకునే సత్తా వారి చేతుల్లోనే ఉంటుంది.  జంకు, గొంకు లేకుండా  ధైర్యంగా ముందుకెళతారు.  బలిపీఠం పైన విద్యార్థులు  అమరులయ్యే దురవస్థ నుంచి కాపాడుకోవలసిన అవసరం  తల్లిదండ్రులు, సమాజము,  ఉపాధ్యాయులు, అంతకుమించి ప్రభుత్వంపైన ఉన్నది అని గుర్తించడం చాలా అవసరం.

నెహ్రూ మాటల్లో..

తొలి ప్రధాని నెహ్రూ   మాటల్లో " పిల్లలు తోటలోని పూల మొక్కల వంటి వారు  వారిని జాగ్రత్తగా సంరక్షించి వారి అభిమతం మేరకు సరైన చదువుల వైపు ప్రోత్సహించాలి.  జీవన నైపుణ్యాలను ఒకవైపు  అలవరుస్తూనే మరొక వైపు వ్యక్తిత్వ వికాసాన్ని  గణనీయంగా పెంచాలి" అని సూచించారు. పిల్లలు ఆత్మ హత్యలకు గురయ్యే   ప్రమాదాలను, కారణాలను గనుక పరిశీలిస్తే  ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న  బట్టీపట్టే బండ చదువులు, విద్యార్థుల లోపల పరీక్షల భయాన్ని నింపుతున్నాయి . మార్కులు ర్యాంకుల పర్వంలో వెనుకబడిన వారిని అవహేళన చేయడం ఒకవైపు, ఆచార్యులు మరొకవైపు తోటి విద్యార్థులు కూడా అవమానిస్తున్న కారణంగా కూడా విద్యార్థులు   బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లుగా మానసిక నిపుణులు  అంచనా వేస్తున్నారు .  జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ  విద్యార్థుల  వికాసం,  పరీక్షల పట్ల భయం,  పెరుగుతున్న ఆత్మహత్యల పైన నిర్వహించిన అధ్యయనంలో  ప్రస్తుత పరీక్షల విధానమే లోపభూయిష్టంగా ఉన్నట్లు  వెల్లడైంది. ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో కూడా ఆత్మహత్యలు కొనసాగుతుంటే కళాశాల స్థాయికి వచ్చేసరికి మరింత ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నట్లు  ఆర్థిక, సామాజిక,  నేపథ్యం కూడా  బలవన్మరణాలకు తోడు అవుతున్నట్లుగా  అధ్యయనం తేల్చింది.

- వడ్డేపల్లి మల్లేశం, సోషల్​ ఎనలిస్ట్