
చెన్నై నగరంలో ఈమధ్య కాలంలో ఎంత నీటి కొరత ఉందో తెలిసే ఉంటుంది. అక్కడి ఆఫీసుల్లో మంచి నీళ్లు ఇవ్వడం లేదు. హోటళ్లలో కూడా గ్లాసు నీళ్లకంటే ఎక్కువ ఇవ్వం అంటున్నారు. ఇళ్లకు మంచినీటి సరఫరా తగ్గిపోయింది. దీంతో గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఇది చెన్నైలోని పరిస్థితే కావొచ్చు. కానీ, భవిష్యత్‌లో అన్ని చోట్లా ఇలాగే ఉండొచ్చు. నగరాలు, పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ నీటి సమస్య ఎక్కువగా ఉంది. పల్లెలు కూడా నీటి కరవుతో అల్లాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే నీళ్లను జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే త్వరలో రాబోయే వర్షాకాలంలో వర్షపు నీళ్లను నిల్వ చేసుకుని, తిరిగి వాడుకోగలిగితే ఈ సమస్యనుంచి కొంతవరకైనా బయటపడొచ్చు.
నగరాల్లో చిన్న వర్షం పడితే చాలు మోకాలు లోతు నీళ్లుంటాయి. అదే ఎండాకాలం వస్తే వందల అడుగుల బోర్లలోంచి కూడా చుక్క నీరు రాదు. మరి ఆ వర్షపు నీళ్లన్నీ ఏమైనట్లు? ఆ నీటిని సక్రమంగా నిల్వ చేసుకోలేకపోవడం వల్లనే ఇదంతా. ఆ నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రయత్నించాలి. ప్రతి చినుకు మనకు ఉపయోగపడేలా చేసుకోవాలి. నీటి కొరత ప్రతి సంవత్సరం తీవ్రంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో వర్షపు నీటిని స్టోర్ చేసుకోవడం ఒక్కటే మార్గం. ఇళ్లు, అపార్టుమెంట్లు, రోడ్లు, మైదానాలు.. ఇలా అనేక చోట్ల, వర్షపు నీటిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిల్వ చేసుకోవచ్చు.
రెండు మార్గాలు…
వర్షపు నీటిని నిల్వ చేసుకోవడాన్ని ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్’ అంటారు. ఇది రెండు రకాలు. ఒకటి ఇళ్ల పైకప్పు మీద పడే నీళ్లను దాచుకోవడం. రెండోది నేలపై పారే నీళ్లను నిల్వ చేసుకోవడం. నీటి సమస్య రాకూడదనుకుంటే, ప్రతీ ఒక్కరు ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్’ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇళ్లకైతే రూఫ్‌టాప్ మెథడ్ మంచిది. అపార్టుమెంట్లు, ఫ్లాట్స్కైతే రెండింటినీ ఫాలో అవ్వొచ్చు.
రెయిన్ వాటర్ బ్యారెల్స్…
దీని కోసం ముందుగా ‘క్యాచ్మెంట్ ఏరియా’ను ఎన్నుకోవాలి. అంటే ఏ ప్రదేశం నుంచి వర్షపు నీళ్లను సేకరిస్తామో ఆ ఏరియాను క్యాచ్మెంట్ ఏరియా అంటారు. అంటే ఇల్లు, అపార్టుమెంట్ల పై కప్పు, లోతట్టు ప్రదేశాలు వంటివి. రూఫ్‌టాప్ మెథడ్‌లో ఇంటి పై కప్పు మీద కురిసే వర్షపు నీళ్లను ఒడిసిపట్టాలి. ఈ నీళ్లన్నీ ఒక పైపు ద్వారా కిందికి వచ్చే ఏర్పాటు ఎలాగూ ఉంటుంది. ఈ నీళ్లను స్టోర్ చేసుకునేందుకు ఇంటి పక్కనే అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత బ్యారెల్స్, డ్రమ్ములు, ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీళ్లు పైపుల ద్వారా వీటిలోకి వచ్చేలా చూడాలి. ఇలా వచ్చిన నీటిని తర్వాత వాడుకోవచ్చు. అయితే వర్షం పడ్డ మొదటి సారి వచ్చే నీళ్లను నిల్వ చేసుకోకూడదు. ఈ నీళ్లలో ఎక్కువ కాలుష్యకారకాలుంటాయి. గాలిలో ఉన్న హానికర ధూళి, రసాయనాలతో కలిసి వర్షం పడుతుంది. ఈ నీళ్లను తొలగించాలి. దీన్ని ‘ఫస్ట్ఫ్లష్’ అంటారు. తర్వాత వచ్చి చేరిన నీళ్లను డ్రమ్ములు, బ్యారెల్స్‌లో స్టోర్ చేసుకోవాలి. ఈ నీటి నిల్వ ద్వారా దోమలు రాకుండా నీళ్లపై మూతలు పెట్టాలి. నీళ్లు ట్యాంకులోకి చేరే పైపుల దగ్గర ‘నెట్లాన్’ వంటి ఫిల్టర్లు వాడాలి. వర్షం పడి వెలిసిన ప్రతిసారీ ఫిల్టర్లను శుభ్రం చేయాలి. ఇలా స్టోర్ చేసుకున్న నీటిని వర్షాలు పడనప్పుడు మొక్కలకు, గార్డెనింగ్‌కు వాడుకోవచ్చు. అయితే ఈ విధానంలో స్టోర్ చేసుకునే నీళ్లు పరిమితం. డ్రమ్ములు, ట్యాంకుల కెపాసిటీకి తగ్గట్టు మాత్రమే ఉంటాయి.
వెట్ అండ్ డ్రై సిస్టమ్స్...
దీనిలో కూడా రూఫ్‌టాప్ పద్ధతిలోనే నీళ్లను సేకరించాలి. అయితే వెట్ సిస్టమ్‌లో అండర్‌గ్రౌండ్ పైపుల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో స్టోరేజ్ ట్యాంకులను ఇంటికి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ట్యాంకులకు భూమిలోపలి నుంచి పైపులు కనెక్ట్ అయి ఉంటాయి. వీటి ద్వారా ట్యాంకులకు నీళ్లు చేరుతాయి. ట్యాంకుతోపాటు కింద పైపులు ఉంటాయి కాబట్టి, ట్యాంకు ఖాళీ అయినా పైపుల్లో నీళ్లు ఉండిపోతాయి.
పైపుల్లో ఎప్పుడూ నీళ్లుంటాయి కాబట్టి, దీన్ని ‘వెట్ సిస్టమ్’ అంటారు. ‘డ్రై’ సిస్టమ్‌లో పైపులు ట్యాంకు పైన ఉంటాయి. ట్యాంకులో నీళ్లు నిండిన తర్వాత పైపులు ఖాళీగా ఉంటాయి. అందువల్ల దీన్ని ‘డ్రై సిస్టమ్’ అంటారు. పైపుల ఏర్పాటును బట్టే ఈ తేడాలు.
రెయిన్ గార్డెన్…
ఇంటిపక్కన కాస్త ఖాళీ స్థలం ఉండి, మొక్కలు పెరగగలిగితే ‘రెయిన్ గార్డెన్’ సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని ఇంటికి కనీసం మూడు మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ స్టోర్ అయ్యే నీళ్లు ఎక్కువైతే అవి ఇంట్లోకి వచ్చి చేరే అవకాశం ఉంది. ఈ ప్రదేశం కొద్దిగా లోతట్టుగా ఉండేలా చూడాలి. గొయ్యి తవ్వి అడుగు భాగంలో రాళ్లు పేర్చి, మట్టితో పూడ్చాలి. ఎక్కువ నీళ్లను తట్టుకుని పెరగగలిగే కొన్ని మొక్కల్ని ఈ ప్రదేశంలో పెంచాలి. ఇక్కడికి వర్షపు నీళ్లు వచ్చి చేరేలా చూడాలి. అలా చేస్తే వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకుతుంటాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి.
ఆధునిక నిర్మాణాలు…
ప్రస్తుతం ఉన్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని కొత్తగా నిర్మించుకునే ఇళ్లు, అపార్టుమెంట్లు, ఆఫీసులకు ఈ సమస్య రాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం చాలా నిర్మాణ సంస్థలు ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్’తో కూడిన అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. అంటే వర్షపు నీళ్లు చేరేందుకు అండర్‌గ్రౌండ్‌లో ఒక ట్యాంకు నిర్మించడం లేదా ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో అక్కడి వాళ్లకు నీటి కొరత రాదు.