
గద్వాల, వెలుగు: బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్న తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, బుజ్జగింపులే తప్ప న్యాయం చేయడంలేదని మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండేరులో మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో ‘జై తెలంగాణ’ అనని వాళ్లకు టికెట్ ఇచ్చారని, తమకు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని చెప్పారు.
‘‘ఎన్నికలలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. నా కొడుకు మందా శ్రీనాథ్‌కు ప్రత్యామ్నాయం చూపిస్తామని బుజ్జగించి నిరాశకు గురిచేశారు” అని వాపోయారు. ఉద్యమ సమయంలో ఆంధ్ర ఎంపీలను ఎదుర్కొని లోక్ సభలో రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడానికి పోరాడానని, శ్రమ ఒకరిది ఫలితం మరొకరికా అని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల అభిష్టం, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మంద శ్రీనాథ్‌ను అభ్యర్థిగా ప్రకటించాలన్నారు.