గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్

గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్

వికారాబాద్, వెలుగు: గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో గిరిజన చెంచు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన చెంచులకు పక్కా ఇల్లు ఉండాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 

మదనపల్లి గ్రామ చెంచు కాలనీలో రూ.7 లక్షలతో సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో మురుగు కాలువలు నిర్మించినట్లు గుర్తు  చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్​ కలెక్టర్లు లింగ్యా నాయక్, ఎం.సుధీర్, ఆర్డీవో వాసుచంద్ర, డీటీడబ్ల్యూవో కమలాకర్ రెడ్డి, హౌసింగ్ పీడీ దశరథ్ సింగ్ రాథోడ్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బస్సు ప్రమాద బాధితులకు పరిహారం..
ఇటీవల చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో కేరెల్లి గ్రామానికి చెందిన బేగరి జయసుధ, కొండాపూర్ కుర్దుకు చెందిన యశ్వంత్ రెడ్డి, ధారూర్ కు చెందిన బేగరీ నాగలక్ష్మి, చెంగోల్ నందిని గాయపడగా, వీరికి రూ.2 లక్షల చొప్పున స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ శుక్రవారం పరిహారం అందజేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో పాల్గొన్నారు.