స్కూల్ ఫీజులు పెంచుతున్నం

స్కూల్ ఫీజులు పెంచుతున్నం
  • పేరెంట్స్ కు లెటర్లు, మెయిల్స్ పంపుతున్న ప్రైవేట్ స్కూళ్లు 
  • ఫీజుల కట్టడిపై స్టడీకి కేబినెట్ సబ్ కమిటీ  వేసిన సర్కార్  
  • ముందే జాగ్రత్త పడుతున్న స్కూల్ మేనేజ్ మెంట్లు   
  • ఈసారి 5 నుంచి 30 శాతం పెంచుతున్నట్లు లెటర్లు 
  • తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు
  • రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్   

వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన రాజు ప్రైవేట్ ఎంప్లాయ్​. తన కొడుకుని అదే ఏరియాలోని ఓ సీబీఎస్ఈ స్కూల్ లో 9వ క్లాస్ లో చదివిస్తున్నడు. ఇప్పటివరకు ఏడాదికి రూ. 2.40 లక్షల ఫీజు.. ఒక్కో టర్మ్ లో రూ. 80 వేల చొప్పున కడ్తున్నడు. అయితే, ఈ సారి ఫీజులు పెంచుతున్నమని.. ఒక్కో టర్మ్ కు రూ. 90 వేలు కట్టాలంటూ స్కూల్ నుంచి వాట్సాప్ మెసేజ్ పంపిన్రు. ఏప్రిల్ 10వ తేదీలోపే టర్మ్ ఫీజు కట్టాలని లేకపోతే.. అడ్మిషన్ కంటిన్యూ చేయబోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చిన్రు. దీంతో ఏం చేయాల్నో తెల్వక తలపట్టుకున్నడు రాజు. ఈ ఒక్క స్కూల్ మాత్రమే కాదు.. అనేక ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ పేరెంట్స్ కు ఇట్లనే లెటర్లు, మెయిల్స్, మెసేజ్ లు పంపుతున్నయి. కొన్ని స్కూళ్లు 5% ఫీజు పెంచితే.. మరికొన్ని స్కూళ్లు 30% వరకూ ఫీజులు పెంచినయని పేరెంట్లు చెప్తున్నరు. 
హైదరాబాద్, వెలుగు:  
ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల పెంపు పేరుతో పేరెంట్స్​కు మళ్లీ దడ పుట్టిస్తున్నయి. కరోనా టైంలోనూ విచ్చలవిడిగా ఫీజులను గుంజిన స్కూల్ మేనేజ్​మెంట్లు ఈసారి ఫీజులు భారీగా పెంచుతున్నయి. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయడంపై స్టడీ కోసం ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీని వేసింది. కమిటీ నివేదిక రాక ముందే.. ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్లు జాగ్రత్తపడుతున్నయి. ఈ అకడమిక్ ఇయర్ అయిపోక ముందే.. వచ్చే 2022–23 అకడమిక్ ఇయర్​కు ఫీజులు పెంచుతున్నట్లుగా మెసేజ్​లు పంపుతున్నయి. కొన్ని స్కూళ్లు అయితే.. ఏప్రిల్ 10లోపు ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టకపోతే పిల్లల అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామంటూ బెదిరిస్తున్నయి. 
మరికొన్ని స్కూళ్లు మాత్రం.. ఇన్ టైంలో ఫీజు కడితే 5% డిస్కౌంట్ కూడా ఉంటుందంటూ సర్క్యులర్ లు జారీ చేస్తున్నయి. 
ముందు జాగ్రత్తగానే..
ఫీజుల దోపిడీకి అడ్డుకట్టపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేయడంతో ప్రైవేట్ స్కూళ్లు ముందు జాగ్రత్తగా ఇప్పుడే ఫీజులు పెంచుకుంటున్నయి. అందుకే.. వచ్చే అకడమిక్ ఇయర్​కి మూణ్నెళ్ల ముందే ఫీజుని డిక్లేర్ చేశాయి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు. ప్రస్తుతం ఉన్న ఫీజుకి స్కూల్ రేంజ్​ని బట్టి ఫీజుని డిసైడ్ చేశాయి. ఫీజులు పెంచినట్లుగా ఒక లెటర్ ని ప్రిపేర్ చేసి పేరెంట్స్​కి పంపిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రైవేట్ స్కూళ్లు మారిన ఫీజు స్ట్రక్చర్​ని పేరెంట్స్​కుపంపించాయి. మిగతా స్కూల్స్ కూడా వీటినే ఫాలో అవుతున్నాయి. దీంతో బడ్జెట్ స్కూల్స్ మినహాయిస్తే.. కొంచెం పేరున్న పెద్ద స్కూళ్లలో ఫీజులు క్లాస్​ను బట్టి లక్ష నుంచి నాలుగు లక్షల వరకూ చేరనున్నాయి. ప్రస్తుతం 6వ క్లాస్ స్టూడెంట్ కు ఏడాదికి రూ. 90 వేల ఫీజుంటే అది 1.20 లక్షలు కానుంది. హైక్లాస్ లకైతే ఫీజు మూడు, నాలుగు లక్షలపైనే అవనుంది. ఇదేంటని ప్రశ్నించిన పేరెంట్స్​కు ఏవేవో కారణాలను చెప్తున్నారు. కరోనా ప్యాండెమిక్ కారణంగా రెండేళ్లుగా ఫీజులు పెంచలేదని, అందుకే ఇప్పుడు హైక్ చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో పేరెంట్స్ తీవ్రంగా మానసిక ఆందోళన గురవుతున్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. 
కోర్టు ఆర్డర్ నూ పట్టించుకుంటలే 
 కొత్త అకడమిక్ ఇయర్​కి ఇంకా టైం ఉన్నా పేరెంట్స్ ముందే ప్రిపేర్ అయి ఉండేలా స్కూల్ మేనేజ్ మెంట్లు ప్రయత్నాలు చేస్తున్నయి. అందుకే ఇప్పటినుంచే మెయిల్స్, మెసేజ్​లు పెడుతున్నాయి. ఫీజుల నియంత్రణ కోసం 2016లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైనప్పటికి, స్టేల రూపంలో ఇంకా ఆ కేసు కొనసాగుతుందని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వెంకట్ సాయినాథ్ తెలిపారు. ఆ తర్వాత 2018–19లో మళ్లీ తమ అసోసియేషన్ తరఫున  ఫీజులు పెంచొద్దని పిటిషన్ వేశామన్నారు. తిరుపతిరావు కమిటీ రిపోర్టు వచ్చేదాక ఫీజులు పెంచకూడదని హైకోర్టు తెలిపిందని, అందుకు స్టే ఇస్తూ హైకోర్టు అప్పుడున్న ఫీజు, పెంచిన ఫీజుకి రెండింటినీ రెండు అకౌంట్లుగా విభజించి లెక్కలు మెయింటెన్ చేయాలని చెప్పిందని, అయినప్పటికీ స్కూల్ మేనేజ్మెంట్లు ఆ లెక్కలు కూడా మెయింటెన్ చేయకుండా కోర్టు ధిక్కరణ కు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. 
ఇప్పటికైనా చర్యలు తీస్కోవాలె.. 
జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో 7 వేల ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. వాటిలో 15 లక్షల మంది చదువుతున్నారు. ఇందులో 60% ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. వెయ్యి నుంచి 1,500 వరకు బడ్జెట్ ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. చిన్న స్కూల్స్ మినహా కార్పొరేట్ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ నుంచి పదో తరగతి వరకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ తీసుకున్నది మొదలు అకడమిక్ ఇయర్ ఫీజుతో సంబంధం లేకుండా పైసలు లాగుతున్నాయి మేనేజ్మెంట్లు. ఆన్​లైన్ క్లాసులకు ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని గవర్నమెంట్ జీవో నం 46 తీసుకొచ్చినా ప్రైవేట్ స్కూళ్లు బేఖాతరు చేస్తూ మొన్నటివరకు మొత్తం ఫీజును కలెక్ట్ చేశాయి. ట్యూషన్ ఫీజులోనే ట్రాన్స్​పోర్ట్, ఇంటర్నెట్, లైబ్రరీ, క్యాంటీన్ వంటి ఇతరత్రా ఫీజులను కూడా జతచేసి కట్టాలని పేరెంట్స్​పై ఒత్తిడి చేశాయి. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవడంతో మరోసారి ఫీజులు పెంచుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్కూళ్ల ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.