ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ముదిగొండ, వెలుగు: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు చెబుదామంటే అందుబాటులో ఉండడం లేదని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట వీఆర్ఏలు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం ఇటీవల చనిపోయిన వీఆర్ఏ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సమస్యలు వినే పరిస్థితి.. వాటిని పరిష్కరించే పరిస్ధితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు అండగా ఉండి సమస్యలు పరిష్కరించేంత వరకు అండగా ఉంటామని తెలిపారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు యర్రబోలు వేణుగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు కొమ్మినేని సుధాకర్, ప్రధాన కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యూవమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్, పార్టీ లీడర్లు అల్లిక శ్రీకాంత్, మీగడ కోటయ్య, గోవర్ధన్ రెడ్డి, మునేశ్వర్ రావు, బెల్లంకొండ శ్రీను, బెండు సురేశ్, వెంకయ్య, మరికంటి నరేశ్, నల్లమోతు రంగయ్య పాల్గొన్నారు. 

రూ.31 లక్షల నిధులు దుర్వినియోగం

  •     నేలకొండపల్లి పంచాయతీ సెక్రటరీపై కేసు నమోదు
  •     మూడేండ్లుగా ఆడిట్ లో గుర్తించని ఆఫీసర్లు

నేలకొండపల్లి, వెలుగు: నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీలో రూ.31 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన  పంచాయతీ సెక్రటరీపై కేసు నమోదైంది. ఎంపీడీవో జమలారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా గతంలో పని చేసిన చెన్ను రాంనరేశ్​పై ఆరోపణలు రావటంతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆగష్టు నెలలో  విచారణ చేపట్టగా, 2019‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 2022 వరకు మూడేండ్లలో ఇంటి పన్ను, నీటి పన్ను,ఇంటి పర్మిషన్ల, వివిధ లైసెన్సులకు సంబంధించి రూ.31,94,959 వసూలు చేసి ఖజానాలో జమ చేయకపోవడం, రసీదు పుస్తకాలను దాచి ఉంచినట్లు గుర్తించామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రాంనరేశ్​పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడంతో సెక్షన్ 409 కింద  కేసు నమోదు చేశారని చెప్పారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలాఉంటే మూడేండ్లుగా ఆడిట్ లో నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ, ఖర్చులకు సంబంధించి ప్రతి ఏడాది ఆడిట్  చేస్తున్నా అక్రమాలను గుర్తించక పోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో సెక్రటరీపై ఆరోపణలు రావడతో జీపీ రికార్డులను డీపీవో, డీఎల్​పీవో స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని అంటున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి. 

దేవస్థానం భూముల ఆక్రమణపై విచారణ షురూ

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల ఆక్రమణపై కదలిక వచ్చింది. ఏపీలో విలీనమైన ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని 980 ఎకరాల భూముల్లో అక్కడి వారు అక్రమంగా కట్టడాలు చేపడుతున్నారు. ఈవో శివాజీ ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి అడ్డుకున్నా పొలిటికల్​ లీడర్ల సాయంతో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. దీనికితోడు ఇటీవల మరికొందరు దేవస్థానం భూముల్లో పాకలు వేశారు. దేవస్థానం భూముల ఆక్రమణల విషయాన్ని ఈవో శివాజీ ఇటీవల తెలంగాణ కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనల మేరకు సోమవారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా కలెక్టర్​ సుమిత్​కుమార్, ఎస్పీ సతీష్​కుమార్​లను ఈవో కలిసి ఆక్రమణల వివరాలు అందజేయడంతో పాటు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు చూపించారు. కోర్టు ఆర్డర్లు ఉన్నా ఆక్రమణదారులు దురుసుగా వ్యవహరిస్తూ స్థానిక పొలిటికల్​ లీడర్ల సాయంతో దాడులకు దిగుతున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్​ సుమిత్​కుమార్ సీరియస్​ అయ్యారు. చింతూరు ఐటీడీఏ పీవో రామశేషుకు ఫోన్​ చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఎటపాక మండలకేంద్రానికి పీవో రామశేషు వచ్చి విచారణ చేపట్టారు. దేవస్థానం ఏఈవో, సూపరింటెండెంట్​లు వెళ్లి కోర్టు ఆర్డర్లు, పట్టాలు చూపించారు. ఆక్రమణదారులను కూడా పిలిపించి పీవో మాట్లాడారు. కోర్టు ఆర్డర్లు ధిక్కరించి ఎలా నిర్మించారంటూ నిలదీశారు. కలెక్టర్​ ఆర్డర్​ వస్తే అక్రమణలు కూల్చేస్తామని హెచ్చరించారు.

నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి

ఖమ్మం రూరల్, వెలుగు: వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీపీ బోస్  సూచించారు. మంగళవారం మండలంలోని పెద్దతాండ పంచాయతీలోని మున్నేరు వద్ద వినాయక నిమజ్జనం చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వినాయక విగ్రహాలను గజ ఈతగాళ్ల ద్వారా మున్నేరులో నిమజ్జనం చేయించాలని అన్నారు. గణనాథులతో పాటు కమిటీ సభ్యులను అనుమతించ వద్దని సూచించారు. హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా చూడాలన్నారు. ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు, సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ బెల్లం ఉమ, ఎంపీడీవో అశోక్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, సుడా  డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, టీఆర్ఎస్  మండల అధ్యక్షుడు బెల్లం వేణు, ఉపాధ్యక్షుడు ముత్యం పెద్ద కృష్ణారావు, వెంపటి రవి, ఉదయ్  పాల్గొన్నారు. 

అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల వడ్లు పట్టివేత

ఖమ్మం రూరల్, వెలుగు: అనుమతులు లేకుండా అక్రమంగా లారీలో తరలిస్తున్న 30 టన్నుల వడ్లను రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ బైపాస్ వద్ద మంగళవారం రాత్రి టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్​ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగూడెం గ్రామానికి చెందిన కన్నీటి నరసింహారావు రైస్ మిల్లు నుంచి రూ. 7.96 లక్షల విలువైన 796 బస్తాల వడ్లను సూర్యాపేట జిల్లా కోదాడలోని  పద్మావతి రైస్ మిల్లుకు  తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను మిల్లర్ల వద్ద నిలువ చేయగా వాటిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుకున్న లారీని రూరల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్ సీఐ రమేశ్, ఏఎస్సై చారి, కానిస్టేబుల్ హమీద్, ఉపేందర్ పాల్గొన్నారు.

ఆదివాసీలను హత్య చేస్తున్రు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇన్​ఫార్మర్ల పేరుతో అమాయక ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేస్తున్నారని ఓఎస్డీ టి సాయి మనోహర్​ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ–ఛత్తీస్​ఘడ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని అమాయక ఆదివాసీలను ఇన్​ఫార్మర్​ ముద్ర వేసి హత్య చేయడం దారుణమన్నారు. తెలంగాణలో మావోయిస్టులు ఉనికి కోల్పోయారని అన్నారు. అమాయకుడైన ఇర్ప రాముడిని హతమార్చి ఆదివాసీలను బెదిరిస్తున్నారని చెప్పారు. మావోయిస్టులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆదివాసీల అభివృద్ధికి మావోయిస్టులు ఆటంకంగా మారారని 
పేర్కొన్నారు. 

గవర్నమెంట్​ హాస్పిటల్​లో బాలింత మృతి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలోని రామవరం మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో బాలింత మృతి చెందింది. మృతురాలి భర్త మహేశ్​​తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు మండలం ధనియాలపాడు గ్రామానికి చెందిన ఈసం సరిత(26)ను రెండో కాన్పు కోసం సోమవారం ఇల్లందులోని గవర్నమెంట్​ హాస్పిటల్​కు ఆమె బంధువులు తీసుకెళ్లారు. ముందస్తు జాగ్రత్తగా అక్కడి వైద్యులు ఆమెను రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున వైద్యులు సిజేరియన్​ చేసి సరితకు డెలివరీ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. రక్తం తక్కువగా ఉందని చెప్పిన వైద్యులు రక్తం ఎక్కించలేదని సరిత భర్త మహేశ్​​వాపోయాడు. గట్టిగా నిలదీసిన తర్వాత రక్తం ఎక్కించారని, కొంత సేపటికే మృతి చెందిందని చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని, డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశాడు. సరిత మృతికి నిరసిస్తూ హాస్పిటల్​ ఎదుట ఆందోళన చేశారు.

రేషన్ షాప్​ సీజ్

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: మండలంలోని అబ్బుగూడెం గ్రామంలోని రేషన్ షాపును మంగళవారం స్టేట్  విజిలెన్స్ ఆఫీసర్లు కమల్ పాషా, చారి, పుల్లయ్య తనిఖీ చేసి సీజ్ చేశారు. డీలర్​ సమయపాలన పాటించడం లేదని, రేషన్ సక్రమంగా ఇవ్వడం లేదని గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్లు గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో డీలర్​ అందుబాటులో లేకపోవడం, షాపు తెరవకపోవడంతో సీజ్ చేసినట్లు వారు తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో పంచనామా రాసి నివేదికను కలెక్టర్​కు పంపిస్తున్నట్లు చెప్పారు. 

నార్మల్​ డెలివరీలకు ప్రాధాన్యమివ్వాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో మాతృ మరణాల సంఖ్యను తగ్గించాలని వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్ర​ జాయింట్​ డైరెక్టర్​ డాక్టర్​ పద్మజ సూచించారు. కొత్తగూడెంలోని డీఆర్డీఏ ఆఫీస్​ మీటింగ్​ హాల్​లో మంగళవారం వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నార్మల్​ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్​ పక్కాగా నిర్వహించాలని, గర్భిణులకు మంత్లీ చెకప్​ నిర్వహించాలని ఆదేశించారు. హైరిస్క్​ ప్రెగ్నెన్సీని ముందుగానే గుర్తించి హాస్పిటల్స్​కు తరలించాలని అన్నారు. బర్త్​ ప్లాన్​ను ఆన్​లైన్​ చేయించాలని సూచించారు. యూనిసెఫ్​ టీమ్​ డాక్టర్​ స్రవంతి, వి.అర్చన, సందీప్, కార్తీక్, డిప్యూటీ  డీఎంహెచ్​వో డాక్టర్​ సుకృత, డాక్టర్​ శిరీష, డాక్టర్​ సుజాత పాల్గొన్నారు. 

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

మధిర, వెలుగు: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ సూచించారు. మంగళవారం బోనకల్  మండల కేంద్రంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద జరుగుతున్న సుందరీకరణ పనులను జడ్పీ​ చైర్మన్​ లింగాల కమల్​రాజ్ తో కలిసి పరిశీలించారు. కొత్తగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను ప్రారంభించారు. చింతకాని మండలం పాతర్లపాడు,  రైల్వే కాలనీల్లో దళిత బంధు యూనిట్లను పరిశీలించారు. గేదెల యూనిట్​తో  పాటు సెంట్రింగ్, గొర్రెల యూనిట్లను, కిరాణా షాపులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అడిషనల్​​కలెక్టర్​ స్నేహలత పాల్గొన్నారు.   

నేడు సీఎంఆర్ షాపింగ్  మాల్  ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు: సిటీలోని వైరా రోడ్డు జిల్లా కోర్టు సమీపంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నట్లు మేనేజర్  కె.ఫణి తెలిపారు. మంగళవారం ఓ ప్రైవేట్ హోటల్ లో మీడియాతో మాట్లాడుతూ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు అతిథిగా రాజ్యసభ సభ్యులు నామా నాగేశ్వరరావు, వద్దిరాజ్ రవిచంద్ర, వైరా, సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్, సండ్ర వెంకట వీరయ్య, భట్టి విక్రమార్క, కందాల ఉపేందర్ రెడ్డి, ఖమ్మం మేయర్ పూనుకోలు నీరజ, జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ రాజ్, ప్రముఖ సినీ నటుడు రామ్, నటి రీతు వర్మ వస్తున్నట్లు చెప్పారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలతో బట్టలు, బంగారం విక్రయిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు ఆదరించాలని కోరారు.

అంజన్నకు అభిషేకం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారికి అభిషేకం చేశారు. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సమస్త నదీజలాలు, పంచామృతాలతో అంజన్నకు అభిషేకం చేశారు. తర్వాత తమలపాకులు, నిమ్మకాయలు, అప్పాల మాలలను స్వామికి నివేదించారు. హనుమాన్​చాలీసా పారాయణం జరిగింది. ఉదయం రామాలయం గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేశాక బాలబోగం నివేదించారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్యకల్యాణం జరిపించారు. 

ఘనంగా ‘మువ్వా’ బర్త్ డే

సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు జన్మదినం సందర్భంగా మంగళవారం బస్టాండ్ సెంటర్​లో కేక్ కట్ చేశారు. అనంతరం 10 మంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇదిలాఉంటే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రధాన అనుచరుడిగా ఉన్న మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్,​ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలోని మువ్వా విజయబాబు జన్మదిన వేడుకలో మట్టా దయానంద్ తో కలిసి పాల్గొనడం టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది. మాజీ ఎంపీ శ్రీనివాస రెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే సండ్ర వర్గీయులు ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి వర్గీయుల కార్యక్రమానికి ఎమ్మెల్యే సండ్ర వర్గం నుంచి మహేశ్​ హాజరు కావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీకి మద్యం తరలిస్తున్న కారు బోల్తా

పెనుబల్లి, వెలుగు: ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న కారు రాష్ట్ర సరిహద్దులో బోల్తా పడింది. ఖమ్మం నుంచి కల్లూరు,  పెనుబల్లి చెక్ పోస్ట్​ మీదుగా మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో కల్లూరు పోలీసులు సోమవారం రాత్రి కారును వెంబడించారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్​పోస్ట్​ దాటి ఏపీలోని తిరువూరు చెక్​పోస్ట్​ వద్ద ఉన్న మూల మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. ఎన్టీఆర్​ కృష్ణా జిల్లా తిరువూరు పోలీసులు వంద బీర్లు, వంద ఫుల్​బాటిల్స్​తో పాటు కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. 

బాలికలకు తమ హక్కులు తెలియాలి

భద్రాచలం,వెలుగు: గిరిజన సంక్షేమ​ఆశ్రమ పాఠశాలల్లో చదివే స్టూడెంట్స్​ తమ హక్కులు తెలుసుకొనేలా అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు సూచించారు. మంగళవారం భద్రాచలంలోని వైటీసీలో వాయిస్​ ఫర్​ గర్ల్స్  నాల్గో విడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాయిస్​ ఫర్  గర్ల్స్  ప్రోగ్రాంపై రిసోర్స్ పర్సన్లు, టీచర్లకు అవగాహన కల్పించాలని, ఆడపిల్లలకు ధైర్యం చెప్పేలా వారిని తయారు చేయాలన్నారు. బాలికల్లో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచేలా ఈ ప్రోగ్రామ్​ ఉందన్నారు. త్వరలో నిర్వహించే ఇంటర్​ సొసైటీ లీగ్​ టోర్నమెంట్​ స్పోర్ట్స్ మెటిరియల్​ను పీవో పరిశీలించారు. డీడీ రమాదేవి, స్పోర్ట్స్​ ఆఫీసర్​ వీరునాయక్, వాయిస్​ ఫర్​ గర్ల్స్ ఆపరేషన్​ మేనేజర్​ విశ్వవాణి, ప్రాజెక్టు ఆఫీసర్​ భాగ్యశ్రీ, దేవీ ఆనంద్​ పాల్గొన్నారు.