
ఢిల్లీలో తాము సురక్షితంగా లేమని, ఇంకా 2012లోనే ఉన్నామని నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పారు. దేశ రాజధానిలో మహిళలకు సరైన భద్రత కల్పించాలని, బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగి నేటికి పదేళ్లు అవుతోంది. ఈ సందర్బంగా గత దశాబ్దంలో పరిస్థితులు మెరుగుపడ్డాయా..? అని ఆశాదేవిని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు "10 సంవత్సరాలు గడిచాయి. మహిళలు సురక్షితంగా ఉంటే, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగితే మేము ఇక్కడ ప్లకార్డులతో రోడ్డుపై ఎందుకు నిలబడతాము" అని అన్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఓ యువతిపై యాసిడ్ దాడి, శ్రద్దా వాకర్ హత్య వంటి ఉదాహరణలను ఉటంకిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
2012 డిసెంబర్ 16న ఢిల్లీలోని ఓ యవతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు కొద్దిరోజులు చావుతో పోరాడి మృతి చెందింది. ఈ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. నిందితులను ఉరితీయాలని ప్రజలంతా ముక్తకంఠంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేశారు. నిందితుల్లో ఒకరు జైల్లో అత్మహత్య చేసుకోగా.. మిగతా నలుగురిని ఉరి తీశారు.