విలీనం డిమాండ్​ పక్కనపెడుతున్నం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

విలీనం డిమాండ్​ పక్కనపెడుతున్నం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్​ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, మిగతా డిమాండ్లపై సర్కారు తమను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. 23 మంది కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని, బాధిత కుటుంబ సభ్యులతో త్వరలో గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. ఈ నెల 16న ఇందిరా పార్కు దగ్గర తాను, జేఏసీ కో-కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. గురువారం వీఎస్టీలోని ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీస్ లో జేఏసీ, అఖిలపక్ష నేతలు సుదీర్ఘంగా సమావేశమై.. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. సమావేశం తర్వాత జేఏసీ కార్యాచరణను అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

‘సేవ్​ ఆర్టీసీ’ ర్యాలీలు..

‘‘ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాం. మిగతా డిమాండ్లపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం”అని అశ్వత్థామరెడ్డి చెప్పారు. హైకోర్టును, ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర ఆర్టీసీని రక్షించాలంటూ ‘సేవ్ ఆర్టీసీ’బైక్ ర్యాలీలు చేపడుతున్నామని చెప్పారు. 16న జేఏసీ నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ఇప్పటికే పోలీసుల అనుమతి కోరామన్నారు. 17,18న అన్ని డిపోల దగ్గర 50 మందికి తగ్గకుండా సామూహిక దీక్షలు చేపడతామని అన్నారు. ఈ నెల 19న హైదరాబాద్ నుండి కోదాడ వరకు సడక్ బంద్ చేపడుతున్నామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. సడక్ బంద్ లో కార్మిక సంఘాలు, పార్టీల నేతలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని, మద్దతు ప్రకటించాలని కోరారు.

గవర్నర్​ను కలుస్తం..

ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలతో గవర్నర్ ను కలుస్తామని, ఇప్పటికే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరామని, నేడో రేపో రాజ్ భవన్ నుంచి పిలుపు వస్తుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. త్వరలో నేషనల్​ హ్యూమన్‌‌ ​రైట్స్​కమిషన్‌‌ను కలిసేందుకు నివేదిక రూపొందిస్తున్నామన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి, రిజర్వేషన్లు కోల్పోతారని, 5,100 రూట్లు ప్రైవేట్ చేస్తే 27 వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పుడిస్తున్న ధరలు గిట్టుబాటు కావని ప్రైవేట్ ఆపరేటర్లు రెండు రోజుల క్రితం చెప్పారని, 3 నెలలకొకసారి చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారని గుర్తు చేశారు. సమావేశంలో టీజేఎస్ చీఫ్ కోదండరాం, బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్పా ల్గొన్నారు.

కిషన్ రెడ్డిని కలిసిన జేఏసీ నేతలు

జేఏసీ మీటింగ్​జరుగుతున్న టైంలోనే అశ్వత్థామరెడ్డి, మరో ఇద్దరు నేతలు హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఆర్టీసీ సమ్మెకు కిషన్​రెడ్డి మద్దతు తెలి పారని, జేఏసీ తరుఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. సమ్మెపై వివరంగా అడిగి తెలుసుకున్నారని, కేంద్ర హోం మంత్రి అమిషా దృష్టికి తీసుకెళ్తానని, సీఎంతోనూ మాట్లాడతానని హామీ ఇచ్చారని చెప్పారు.

మంత్రులు ఎక్కడున్నరు

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కనీసం స్పందించడంలేదని మండిపడ్డారు. బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. కార్మికులు ఆత్మస్ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, బతికి సాధించుకుందామని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడదామన్నారు. పోలీసులు అరెస్టు చేసిన జేఏసీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, స్టూడెంట్​యూనియన్ల నేతలు సమ్మెకు మద్దతివ్వాలని ఆయన కోరారు.

We are temporarily postponing the demand for RTC merger in government says Chairman of RTC JAC