ఆర్టీసీని బతికిస్తున్నది మేమే: సీఎం రేవంత్

ఆర్టీసీని బతికిస్తున్నది మేమే: సీఎం రేవంత్
  • బీఆర్ఎస్ లెక్క తప్పులు చెయ్యం
  • హరీశ్ ను తొలగించాలని కేసీఆర్ యూనియన్లనే రద్దు చేసిండు 
  • తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బలోపేతానికి, కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను తాము చేయబోమన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు క్వశ్చన్ అడిగారు. దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. 

అయితే ఆ టైమ్ లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ జోక్యం చేసుకుని.. మంత్రి సమాధానం చెప్పిన కూడా సంతృప్తి చెందకుండా బుల్డోజ్​చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. “గతంలో ఆర్టీసీ గుర్తింపు యూనియన్ కు హరీశ్​రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయనను ఎలా తొలగించాలో అర్ధం కాని కేసీఆర్.. ఏకంగా యూనియన్లనే తొలగించారు. కార్మిక సంఘాలను రద్దు చేసిందే బీఆర్ఎస్. పాత తప్పులను కప్పిపుచ్చుకోవటానికి మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నరు” అని మండిపడ్డారు. 

కాగా, తండాల్లో సమస్యలపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ మాట్లాడారు. తండాలు, గూడేలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. “బీఆర్ఎస్ నేతలు ఇంకా వాళ్ల సారు చెప్పిన అబద్ధాల భ్రమల్లోనే ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆదిలాబాద్ లోని గూడెలకు తీసుకెళ్లి చూపించాలని మంత్రి సీతక్కను కోరుతున్న. మిషన్ భగీరథలో 7 లక్షల ఆవాసాలకు నీళ్లు ఇవ్వలేదని మా సర్వేలో తేలింది” అని అన్నారు.

జీపీలకు బిల్డింగ్​లు నిర్మిస్తం: మంత్రి సీతక్క

రాష్ట్రవ్యాప్తంగా 1,851 తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చామని మంత్రి సీతక్క తెలిపారు. 6,176 గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు లేవని, త్వరలో నిర్మిస్తామని చెప్పారు. గ్రామాల్లో మల్టీపర్పస్ వర్కర్లు, పారిశుధ్య కార్మికుల జీతాల కోసం రూ.378.88 కోట్లు విడుదల చేశామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 

ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు: హరీశ్ 

ఆర్టీసీ విలీనంపై ఎందుకు చొరవ తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి,  రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్​మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు  జీతాలు ఇస్తామన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తారు?” అని ప్రశ్నించారు. 

ఆర్టీసీని ఆగం జేసిందే బీఆర్ఎస్: మంత్రి పొన్నం

ఆర్టీసీని ఆగం జేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్మికులతో చర్చించకుండానే అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడిగా ఆర్టీసీ విలీనంపై ప్రకటన చేశారని మండిపడ్డారు. ‘‘ఆర్టీసీ సమస్యకు రాజకీయ రంగుపులిమి కార్మికులను రెచ్చగొట్టారు. గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని చెప్పి, పోలీస్​సెక్యూరిటీతో రాజ్ భవన్ ముట్టడించి, ఇప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలను వల్లించినట్టుగా ఉంది. అప్పుడు యూనియన్లు రద్దు చేసి, ఇప్పుడు యూనియన్లు ఉండాలనడం హాస్యాస్పదం. 

అప్పట్లో ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్.. కార్మికులు 50 రోజులు సమ్మె చేసి చనిపోయినా పట్టించుకోలేదు” అని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం వచ్చాక కొత్త బస్సులు కొన్నామని, పీఆర్సీ బకాయిలు చెల్లించామని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని, ఖాళీలు భర్తీ చేస్తున్నామని చెప్పారు.