రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నరు

రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నరు

కేంద్రంపై పోరాడుదామనే ఢిల్లీకి వచ్చామని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. కానీ తమ ఆందోళనలను పట్టించుకోకుండా పార్లమెంట్ ను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి నిమిషమూ ముఖ్యమే.. కానీ గంటలు గంటలు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. జీఎస్టీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఇవాళ నిరసన తెలిపారు. ఈసందర్భంగా రంజిత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రాజకీయాల కోసం కుట్రపూరితంగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు.  తెలంగాణతో గొడవ పడకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరారు. 

ధాన్యం కొనుగోళ్లపై ఒక్కొక్కరు ఒక్కోలా.. 

ధాన్యం కొనుగోళ్లపై ప్రధానమంత్రి మోడీ, కేంద్రమంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని రంజిత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ మార్కెట్ లో రైస్ డిమాండ్ పెరిగింది..  రైస్ పండించండి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారని గుర్తు చేశారు. పంటల సాగుపై దేశానికి ఒక సమగ్ర విధానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వర్షాలకు పాడైన ధాన్యాన్ని కేంద్రం సేకరించడం లేదని తెలిపారు. ‘‘ ఎఫ్ఆర్బీఎం పరిమితి పెట్టి తెలంగాణపై ఆంక్షలు పెడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి అడ్డుపడుతున్నారు. మా రాష్ట్రానికి అప్పు ఎక్కడ ఎక్కువుందో చెప్పాలని కేంద్రాన్ని అడుగుతున్నాం. కేంద్రం అప్పులు తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే.. తెలంగాణ కూడా అదే పని చేస్తోంది’’ అని రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.