సింపుల్ స్టెప్స్ లో రాఖీ తయారీ

సింపుల్ స్టెప్స్ లో రాఖీ తయారీ

మరో మూడు రోజుల్లో రాఖీ పండుగ. మరి అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకి అద్దం పట్టే ఈ పండుగని కాస్త స్పెషల్​గా చేసుకుంటే బాగుంటుంది. అదెలాగంటే.. ఎప్పటిలా మార్కెట్​లో రాఖీలు కొని కట్టే బదులు ఇంట్లోనే రాఖీలు తయారు చేయొచ్చు. అది కూడా సింపుల్​ స్టెప్స్​లో. 

మట్టితో ...

 • పొడి బంకమట్టికి కొంచెం పౌడర్​ అద్దాలి. దాన్ని చేత్తో చిన్నసైజు పూరీలా చేయాలి.
 • అంచులు సమంగా ఉన్న ​​ గ్లాసుని దానిపై పెట్టి చందమామ ఆకారంలో  కత్తిరించాలి. 
 • చిన్న చాకుతో పువ్వు ఆకారం వచ్చేలా  దానిపై గాట్లు పెట్టాలి.
 • పువ్వు రెమ్మల్ని పోలినట్టు ఉండటానికి చివర్లు చాకుతో అడ్జెస్ట్​ చేయాలి. 
 • మట్టితో మూడు సైజుల్లో చిన్నచిన్న బాల్స్​ చేసి గమ్ముతో ఆ పువ్వు మధ్యలో పెద్ద  బాల్స్​ నుంచి చిన్న  వాటి వరకు సైజ్​ల వారీగా ఒకదానిపై ఒకటి అతికించాలి. పూసల సైజుల్లో మరికొన్ని బంతులు చేయాలి.

సన్నటి కాపర్​ వైర్​ని..

 • సన్నటి కాపర్​ వైర్​ని అర అంగుళం  ముక్కల చొప్పున కట్​ చేయాలి.
 • ఒక్కో వైర్​ని ఒక్కో పువ్వు రెక్కకు  గుచ్చాలి.
 • ఇప్పుడు పువ్వు రెమ్మల చివర్లలో వైర్ల దగ్గర గమ్​ పెట్టి  బంతుల్ని అతికించాలి.  దానంతటికీ తెలుపు, ఆ తర్వాత నలుపు రంగులు వేయాలి.
 • ఆరాక.. నచ్చిన కలర్స్​ వేయాలి. నచ్చిన షేప్​లో  ఆరు చిన్న చిన్న మట్టి ఉండలు చేసి, రంగులు వేయాలి.
 • వాటికి సూదితో రంధ్రం పెట్టి..  మధ్యలోంచి దారం తీయాలి.
 • ఆ దారం మధ్యలో గమ్ముతో చిన్న అట్ట ముక్క అతికించి  దాన్ని పువ్వు వెనక అతికిస్తే మట్టి రాఖీ రెడీ. 

నోట్​:   చందమామ ఆకారం బదులు నచ్చిన షేప్​లో రాఖీని చేసుకోవచ్చు. రకరకాల బొమ్మలు గీసి, రంగులు వేయొచ్చు. ప్లెయిన్​గా ఉంచి కుందన్స్​ అతికించినా బాగుంటుంది. రాఖీకి రెండు చివర్లలో చిన్న రంధ్రం పెట్టి  దారం బయటికి తీసినా సింపుల్​గా రాఖీ రెడీ అవుతుంది. 

గింజలతో...

 • గుప్పెడు గుమ్మడి గింజల్ని  కడిగి ఆరబెట్టాలి. వాటిని మూడు వంతులు చేసి ఒక్కో భాగానికి ఒక్కో రంగు వేసి, కాసేపు పక్కనుంచాలి. 
 • అట్టముక్కని రాఖీ సైజులో నచ్చిన ఆకారంలో కత్తిరించాలి. దానిపై గమ్ముతో కలర్​ కాంబినేషన్స్​ చూసుకుంటూ రెండు లేదా మూడు వరుసల్లో గుమ్మడి గింజల్ని అతికించాలి. వాటిపై కుందన్లు అతికించాలి. 
 • అట్ట వెనుక భాగంలో నచ్చిన రంగు రిబ్బన్​ లేదా దారాన్ని అతికిస్తే  రాఖీ రెడీ అయినట్టే.

నోట్: గుమ్మడి గింజలకి బదులు పెసలు, కందులు, బియ్యం,  డ్రై ఫ్రూట్స్​.. ఇలా వేటితోనైనా ఈ రాఖీ తయారుచేయొచ్చు. కావాలనుకుంటే ప్లెయిన్​ అట్ట ముక్కకి తెలుపు రంగు వేయాలి. ఆరాక నచ్చిన పెయింట్​ వేసి దానిపైన బొమ్మలు వేయాలి. ఆ తర్వాత ఆ అట్టముక్క చివర్లలో గుమ్మడి గింజలు అతికించినా.. రాఖీ అందంగా ఉంటుంది.  ఏమైనా డౌట్​ ఉంటే వీటి తయారీకి సంబంధించిన   వీడియోల్ని యూట్యూబ్​లో చూడొచ్చు.