డబ్బులు పంచుతున్నరని చెప్తే.. మాపైనే దాడులా?

డబ్బులు పంచుతున్నరని చెప్తే.. మాపైనే దాడులా?

మంత్రులు, ఎమ్మెల్యేలు పైసలు పంచుతున్నరు

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ 

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని తాము కోరుకుంటున్నామని, ఇందుకు పోలీసులు, అధికారులు సహకరించాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. కొన్ని చోట్ల పోలీసు అధికారులే డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులు, మద్యం పంచుతున్నారని ఫిర్యాదు చేస్తే, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హారీష్​రెడ్డిపై పోలీసులు దాడి చేయడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆదివారం రాత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్టంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ఎన్నికల కమిషనర్, పోలీసు అధికారులు సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో డబ్బులు పంచి, అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ సీఎం, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని.. రేపు బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. మైలార్ దేవ్ పల్లిలో తమ కార్యకర్తలు రూ.40 లక్షలు పట్టించినా, పోలీసులు కేసు బుక్ చేయలేదన్నారు.

డీజీపీ, ఈసీలదే బాధ్యత

మన్సూరాబాద్​లో సాక్షాత్తు మంత్రి డబ్బులు పంచుతున్నారని సంజయ్ చెప్పారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, తాము ప్రతిదాడులకూ సిద్ధమని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య వస్తే డీజీపీ, ఈసీలదే బాధ్యత అని స్పష్టం చేశారు. డీజీపీ మహేందర్​రెడ్డి అంటే గౌరవం ఉండేదని, ఆయన దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని చేసినా గ్రేటర్​లో గెలిచేది బీజేపీయేనన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ టీఆర్ఎస్ గెలిచేందుకు సలహాలు ఇస్తోందన్నారు. తమ కార్యకర్తలు రోడ్డెక్కితే ఏమవుతుందో చూడాలని, కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని కోరుతున్నామని చెప్పారు. తమ సహనాన్ని పిరికితనంగా భావించొద్దని హెచ్చరించారు. ఈ విషయమై సోమవారం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు డబ్బులు పంచడంపై ఎన్నికల కమిషనర్​కు ఫిర్యాదు చేశామన్నారు.