కేంద్రం ఎన్నో ఏళ్ల కలలను సాకారం చేస్తోంది

కేంద్రం ఎన్నో ఏళ్ల కలలను సాకారం చేస్తోంది

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో దశాబ్దాల కలలను సాకారం చేసుకుంటూ వెళుతుంటే.. బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, తమిళనాడు బీజేపీ పార్టీ కో ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పండుగలా నిర్వహించుకున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరుపుకోవాలన్న కొన్నేళ్ల కల ఈ ఏడాది నెరవేరిందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కూడా అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబరు 17న జరపాలని టీఆర్ఎస్ పార్టీ నాటి అధికార కాంగ్రెస్ ను డిమాండ్ చేసిందని సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. మజ్లిస్ పార్టీకి భయపడి రాజకీయ కారణాలతో విమోచన దినోత్సవాన్ని జరపలేదని విమర్శించారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని ఇచ్చిన పిలుపుతో బీజేపీ ఆదరణ మరింత పెరుగుతుందని భయపడిన కేసీఆర్ రాత్రికి రాత్రి జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారన్నారు. మజ్లిస్ తో కలిసి టీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినం పేరుతో హడావుడి చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అమిత్ షా పై చేసిన వ్యాఖ్యలని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. రాజకీయాలు చేసే పార్టీ టీఆర్ఎస్.. బీజేపీ కాదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ విమోచన ఉద్యమంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పాల్గొన్నారని, వారి పేరుని కావాలనే పాఠ్యపుస్తకాలలో కాంగ్రెస్ పార్టీ చేర్చలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.