తమిళనాడులో కరోనా మరణాలను ప్రభుత్వం దాచిపెడుతోందన్న ఆరోపణలు అర్ధరహితమని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి. కరోనా కేసులు, మరణాల వెల్లడి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఒక వేళ కరోనా మరణాలు దాస్తే ప్రభుత్వానికి ఒరిగేదేమీ ఉండదన్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు చేరలేదని స్పష్టం చేశారు. ఒక్క చైన్నై సిటీ తప్ప అన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చామని, కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. అయితే చెన్నై సిటీలో జన సాంద్రత ఎక్కువగా ఉండడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు.
We don't hide the number of deaths, we won't gain anything if we do that: Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami. #COVID19 https://t.co/s6Uedf70L2
— ANI (@ANI) June 11, 2020
తమిళనాడులో నిన్న 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో ఒక్క చెన్నైలో 1,392 కేసులు వచ్చాయి. మిగిలిన 36 జిల్లాల్లో కలిసి 505 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 36,847 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 1,893 మంది ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 19,333 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో పోరాడుతూ 326 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 17,182 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.