సీఎం ఎవరో మాకు తెల్వదు సార్

సీఎం ఎవరో మాకు తెల్వదు సార్

ఎమ్మెల్యే సాయన్నకు షాకిచ్చిన కల్యాణలక్ష్మి లబ్ధిదారులు

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్​కంటోన్మెంట్​లో ఎమ్మెల్యే సాయన్న ప్రశ్నకు కల్యాణలక్ష్మి లబ్ధిదారులు ఇచ్చిన సమాధానం షాక్​ఇచ్చింది. తమకు సీఎం ఎవరో తెలియదు అని ముఖం మీదే చెప్పడంతో ఎమ్మెల్యే కంగు తిన్నాడు. కంటోన్మెంట్​ఏరియాలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మల్యే సాయన్న గురువారం తన క్యాంప్ ఆఫీసులో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ‘ఈ చెక్కులు ఎవరు ఇస్తున్నారో తెలుసా?’ అని అడగగా లబ్ధిదారులంతా ‘మీరే సార్’ అన్నారు. ‘ఈ చెక్కులు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసా?, కనీసం ఈ రాష్ట్రాన్ని పాలించేది ఎవరో అదైనా తెలుసా? అని మళ్లీ ప్రశ్నించాడు. ‘తెలియదు సార్’ అనడంతో ఎమ్మెల్యే షాక్​అయ్యాడు. ఆఫీసు గోడపై ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో చూపిస్తూ ‘ఈ ఫోటో అయినా ఎవరిదో తెలుసా?’ అని అడిగాడు. దానికి ఓ మహిళ స్పందిస్తూ.. ‘అప్పుడప్పుడు టీవీల్లో చూసినం.. కానీ పేరైతే తెలియదు’ అని చెప్పింది. దీంతో  ఎమ్మెల్యే అసహనానికి గురయ్యాడు. ‘మీ  కూతుళ్ల పెండ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే మేనమామ మన ముఖ్యమంత్రి కేసీఆర్..  ఆయనను ఎట్లా మరిచిపోతారు’ అని గద్దరించాడు. ‘ఇంకోసారి మర్చిపోయాం.. ఎవరో  తెలియదంటే మాత్రం ఊరుకోను’ అని అనడంతో వారంతా  ‘సరే సార్’ అని సమాధానం ఇచ్చారు.