
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ రూపంలో వైరస్ వేగంగా వ్యాప్తి అవుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో లాక్‌డౌన్ విధించారు. దీంతో వలస కార్మికులు తమ సొంతూళ్లకు కదులుతున్నారు. దేశ రాజధానిలో లాక్‌డౌన్ వేయడంతో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్‌కు తరలుతున్నారు. అక్కడి నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఈ లాక్‌డౌన్ ఎక్కువ రోజులు ఉండదని, ఢిల్లీని విడిచి వెళ్లొద్దని మైగ్రంట్ వర్కర్స్‌కు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అవసరమైన వసతులను సమకూర్చుతామని కేజ్రీవాల్ హామీ ఇచ్చినప్పటికీ వలస కార్మికులు సొంతూళ్లకు తరలుతుండటం గమనార్హం. ఆకలితో చావడం కంటే సొంతూరుకు వెళ్లి ఏదో పని చేస్కొని బతకడం మేలని కార్మికులు అంటున్నారు.