మండల ప్రెసిడెంట్లా వ్యవహరించే ఆర్థికమంత్రి గతంలో లేదు

మండల ప్రెసిడెంట్లా వ్యవహరించే ఆర్థికమంత్రి గతంలో లేదు

రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫొటో పెట్టాలన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై టీపీసీసీ ఇంచార్జ్ మాణక్కం ఠాగూర్ ఫైర్ అయ్యారు. నిర్మలా సీతారామన్ది హాస్యాస్పదమైన ప్రవర్తన అన్న ఆయన.. మండలాధ్యక్షుడిలా వ్యవహరించే ఆర్థికమంత్రి గతంలో ఎప్పుడు లేదన్నారు. మన్మోహన్, యశ్వంత్, జశ్వంత్, ప్రణబ్, అరుణ్ వంటి వారు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించారు తప్ప పోస్టర్ల గురించి కాదని ట్వీట్ చేశారు. 

మోడీ ఫొటో ఎందుకు పెట్టలేదు

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తుంటే.. రేషన్​షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని కలెక్టర్ ను నిర్మల ప్రశ్నించారు. ట్రాన్స్​పోర్టు, గోదాం  ఖర్చులన్నీ భరించి పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తుంటే, రేషన్ షాపులో ప్రధాని ఫొటో లేకపోవడమేమిటని మండిపడ్డారు. కేవలం ఇక్కడే కాదని, రాష్ట్రవ్యాప్తంగానూ ప్రధాని ఫొటో పెట్టలేదన్నారు. తమ పార్టీ లీడర్లు ప్రధాని ఫ్లెక్సీలను రేషన్ షాపులో పెట్టడానికి వస్తే వారిని అడ్డుకున్నారని, ఫ్లెక్సీలు చింపివేశారని ఫైర్ అయ్యారు. ‘‘కచ్చితంగా రేషన్​ షాపులో ప్రధాని ఫొటో పెట్టాలి. లేకుంటే మా వాళ్లు వచ్చి పెడతారు. తొలగించటానికి వీల్లేదు’’ అని చెప్పారు. ‘‘ మోడీ ఫొటో పెట్టించండి. నేను మళ్లీ ఇక్కడికి వస్తాను. ఫొటో పెట్టడానికి ఎవరైనా అభ్యంతరం చెప్తే, జిల్లా ఆఫీసర్​గా చర్యలు తీసుకోండి’’ అని కలెక్టర్​కు సూచించారు.