దేశం కోసం ఐదారు మాసాలుగా తలకాయంతా పగలగొట్టుకుంటున్నం

దేశం కోసం ఐదారు మాసాలుగా తలకాయంతా పగలగొట్టుకుంటున్నం
  • ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలె.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలె
  • మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. బతుకుదెరువు ఎన్నిక
  • కాంగ్రెస్‌‌‌‌కు ఓటేస్తే కనగల్ వాగులో వేసినట్టే 
  • భవిష్యత్​లోనూ టీఆర్ఎస్, లెఫ్ట్​ పార్టీలు కలిసే పనిచేస్తయని ప్రకటన

మునుగోడు సభలోనూ సీఎం కేసీఆర్​ కేంద్రాన్ని, ప్రధాని మోడీని టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. బీజేపీని నమ్మొద్దని, నమ్మితే గోసపడుతామని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలోనే కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము తలపడబోయేది బీజేపీతోనేనని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉన్నా లేనట్టేనని, కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ ఆ పార్టీ ఉనికి లేదన్నారు. లెఫ్ట్‌ పార్టీలు, భావసారూప్యత గల పార్టీలతో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని సంకేతాలు ఇచ్చారు.  

నల్గొండ, వెలుగు: బీజేపీని గద్దె దించేందుకు, దేశం నుంచి తరిమేసేందుకు ప్రగతిశీల,  క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలని సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రజలే తన ధైర్యమని, తనను ఆగంజేయొద్దని కోరారు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, బతుకు దెరువు ఎన్నిక అని చెప్పారు. మునుగోడులో శనివారం నిర్వహించిన ‘ప్రజా దీవెన’ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రధాన మంత్రితోనే నేను కొట్లాడుతున్నా అంటే.. నా బలమేంది, ధైర్యమేంది? మీరే కదా! మీరే నన్ను బలహీనపరిస్తే.. నేనేం జేయాలె? మీరే నన్ను ఒక వేళ ఆగం జేస్తే.. బీజేపోళ్లు రేపు ఏమంటరు? నన్ను గుద్ది.. బాయిలకాడ మీటర్లు పెడ్తరు. నేను బలహీనపడితే మోడీపై ఎట్ల కొట్లాడ్త? ఎలక్షన్​ రాంగనే ఆగమాగం కావొద్దు” అని కేసీఆర్​ అన్నారు. మిషన్​ భగీరథతోని ఫ్లోరైడ్​ రహిత నల్గొండగా, ఫ్లోరైడ్​ రహిత మునుగోడుగా మార్చుకున్నామని చెప్పారు. ఈడీ, బోడీలకు తాను భయపడబోనన్నారు. బీజేపీని నమ్మితే అన్ని సంక్షేమ పథకాలు రద్దవుతాయని, ఈ దేశం నుంచి బీజేపీని తరిమికొడితేనే విముక్తి దొరుకుతుందని పేర్కొన్నారు. 

బిడ్డా.. అమిత్​ షా.. కృష్ణా జలాల్లో వాటాపై సమాధానం చెప్పు

‘ఎనిమిదేండ్లలో బీజేపీ ఒక్క మంచి పని చేసిం దా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా.. ప్రభుత్వ సంస్థల్ని తెగనమ్ముతున్నదని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడం లేదో చెప్పాలన్నారు. ‘‘నేను అడిగే ప్రశ్నలకు ఆదివారం జరిగే సభలో సమాధానం చెప్పు బిడ్డా.. అమిత్​ షా’  అని కేసీఆర్​ డిమాండ్​చేశారు.  ‘‘రాజగోపాల్ రెడ్డి, కేంద్ర మంత్రులు, ఇంకో పెద్ద మనిషి ఎవరైనా సరే ఢిల్లీకి పోయి కృష్ణా జలాల్లో వాటా ఎందుకు ఇయ్యరో అడగాలి. రాష్ట్రపతి ఎన్నికల టైంలో ఇరవై ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేకపోయిన్రు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో ఏ ఒక్క మంచిపని జరిగిందో ప్రజలకు చెప్పాలి” అని అన్నారు.  

మోటార్లకు మీటర్ల వెనుక కుట్ర ఉంది

మోటార్లకు మీటర్లు పెట్టాలనడం వెనుక పెద్ద కుట్ర ఉందని కేసీఆర్ ఆరోపించారు. పేదలను దోచి పెద్దలకు పంచే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతోందన్నారు. ‘‘మునుగోడులో బీజేపీకి ఓటు పడితే బాయికాడ మీటర్ పడ్తది.  బాయికాడ మీటర్లు పెట్టి ఎరువులు ధరలు పెంచి, కరెంట్ పిరం చేయాలని కేంద్రం చూస్తున్నది. పండించిన పంటలు కొనకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతుదున్నది. మీటర్లు పెట్టే మోడీ కావాల్నో లేక మీటర్లు వద్దనే కేసీఆర్ కావాల్నో తేల్చుకోవాలె. ప్రజలంతా కలిసి బీజేపీకే మీటర్ పెట్టాల్సిన టైం వచ్చింది” అని పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ బతికున్నంత వరకు తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టం” అని చెప్పారు. మునుగోడులో ఎన్నడూ కూడా బీజేపీకి డిపాజిట్​ రాలేదని, మునుగోడు రైతులు ఓటు వేసే ముందు బోరుకాడికి పోయి దండం పెట్టాలని ఆయన అన్నారు.  

దేశంలో ఏమన్న మర్యాద, ప్రజాస్వామ్యం ఉందా?

ఈడీ, బోడీ అంటూ కేంద్రం భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని, తాను భయపడబోనని కేసీఆర్​ అన్నారు. ‘‘వాళ్ల అహంకారం ఏందండీ..?  దేశంలో ఏమన్న మర్యాద, ప్రజాస్వామ్యం, విలువ ఏమైనా ఉందా? తెలంగాణ అసెంబ్లీల 119 ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో 103 మంది టీఆర్​ఎస్​, ఇంకో ఏడుగురు మిత్ర పక్షం.. మొత్తం 110 మావాళ్లే. బయటున్నయి తొమ్మిది తోకలు.. ఆ తొమ్మిదిల రెండు పార్టీలు.. మాట్లాడెటోడు 3 తోకలున్నోడే. మూడు తోకలున్నోడు 110 తోకలున్నోడ్ని పడగొట్టి ఏక్​నాథ్​ షిండేను తెస్తడట? ఇది ప్రజాస్వామ్యమా? అహంకారమా? బలుపా? అధికార మదంతోని కండ్లు మూస్కొని పోయినయా? ఏందిది? ఇది దేశ మా? అరాచకమా?” అని ప్రశ్నించారు. ఎవర్ని పడి తే వాళ్లను, సీఎంలను, పెద్ద పెద్దవాళ్లను ఈడీ, బోడీ అని బెదిరిస్తున్నారని ఆరోపించా రు. ‘‘ఈడీ వస్తే.. నా దగ్గరేమున్నది. వాడే వచ్చి నాకు చాయ్​ తాగించిపోవాలె. దొంగలు భయపడుతరు.. లంగలు భయపడుతరు. ఈడీ కాకపోతే బోడీ పెట్టు కో.. నీకు భయపడం మోడీ. నువ్వు గోకినా గోకకున్నా నేను గోకుతా అని చెప్పిన. ఈ దేశం, ఎవని అ య్య సొత్తు కాదు.. రాచరిక వ్యవస్థ కాదు’’ అని పేర్కొన్నారు.

సీపీఐ, సీపీఎం, టీఆర్​ఎస్​ కలిసి పనిచేస్తయ్​

మునుగోడులో టీఆర్​ఎస్​ను గెలిపిస్తామని సీపీఐ వాళ్లు మద్దతు ప్రకటించారని, వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేసీఆర్​ చెప్పారు. ‘‘దేశంలో జరిగే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం జరగాల్సి ఉంది.. దీనిపై జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి కమ్యూనిస్టు పార్టీల నాయకులతో, ఇతర నాయకులతో నేను చర్చలు జరుపుతున్న. ఈ దేశాన్ని, ప్రజలు ఎట్లా కాపాడుకోవాలని గత ఐదారు మాసాలుగా తలకాయంతా పగలగొట్టుకుంటున్నం. ఆలోచన చేస్తున్నం” అని పేర్కొన్నారు. ‘‘ఇంకో ఏడాదైతే ఎలక్షన్లే వస్తయ్.. ఇప్పుడు జరిగే మునుగోడు ఉప ఎన్నిక పెద్ద గోల్​మాల్ ఎన్నిక. ఎవరి సంక్షేమం కోసం ఈ ఎన్నిక జరుగుతున్నది. దీని వెనక మాయమశ్చీంద్రాలు ఉన్నయ్​. వాటిని గుర్తుపట్టాలి. మునుగోడు మంటలు ఢిల్లీ వరకు పాకాలంటే కలిసికట్టుగా పోరాడాలి. మునుగోడు నుంచి అనూహ్య ఫలితం రావాలి. దేశమంతా ఏమనుకుంటుందనే విషయం మునుగోడు గడ్డ నుంచి ఢిల్లీ దాకా తెలిసేలా చేయాలి” అని ​ అన్నారు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా కమ్యూనిస్టు పార్టీలతో ఐక్యత కొనసాగుతుందని, ప్రగతి శీల శక్తులందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామని తెలిపారు. నేడో రోపే సీపీఎం కూడా తమతో కలిసి వస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా సీపీఐ, సీపీఎం, టీఆర్​ఎస్​, మిగతా క్రియాశీల శక్తులన్ని కలిసి పనిచేస్తాయని ప్రకటించారు.

కాంగ్రెస్‌‌కు ఓటేస్తే కనగల్ వాగులో వేసినట్టే.. 

‘‘కాంగ్రెస్‌‌కు ఓటేస్తే కనగల్ వాగులో వేసినట్టే.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది వృథా అవుతుంది’’ అని కేసీఆర్ అన్నారు. ఆ పార్టీ అక్కడ ఇక్కడ ఎక్కడా లేదని విమర్శించారు. చండూరులో మరో సభ పెట్టుకుందామని, ఆ సభకు వేరే వాళ్లను వెంటపెట్టుకొని వస్తానని కేసీఆర్​ చెప్పారు. 

అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్​

మునుగోడు సభలోనే టీఆర్ఎస్​ అభ్యర్థిని సీఎం ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వమే ఖాయమైందనే చర్చ కూడా జరిగింది. కానీ, అభ్యర్థిని కేసీఆర్​ ప్రకటించకుండా సస్పెన్స్​ ఉంచారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే దాకా ఇదే సస్పెన్స్ కొనసాగించే చాన్స్​ ఉన్నట్లు తెలుస్తున్నది. సాగర్​ బైపోల్​టైంలోనూ టీఆర్​ఎస్​ అభ్యర్థిని కేసీఆర్​ వెంటనే ప్రకటించ లేదు. అసంతృప్తులను చల్లబరిచే ఆపరేషన్ పూర్తయ్యి, నోటిఫికేషన్ వచ్చాకే క్యాండిడేట్​ను ప్రకటించారు.  మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించే వరకు వేచి చూడా లనే ఆలోచనలో టీఆర్​ఎస్​ ఉన్నట్లు తెలిసింది.