దేశంలో కరోనా శాంతించిందా?

దేశంలో కరోనా శాంతించిందా?

దేశంలో కరోనా కేసులు తగ్గడం చూస్తుంటే.. మనం పీక్ స్టేజీని దాటిపోయినట్టేనని వైరస్​పై స్టడీ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆదివారం చెప్పింది. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఫిబ్రవరి వరకు కరోనా ఫ్రీ అయితమంది. వచ్చే పండుగల సీజన్​లో చాలా జాగ్రత్తగా ఉండాలంది. ఈ స్టేజ్​లో నిర్లక్ష్యం చేస్తే పాతిక లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చే ముప్పుందని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 75 లక్షల కేసులు నమోదు అయినట్టు తెలిపింది. మరోవైపు చలికాలంలో కరోనా సెకండ్​ వేవ్​ ఉండే చాన్స్​ ఉందని నీతి ఆయోగ్ మెంబర్ వీకే పౌల్ అన్నారు. అయితే యూరప్​ దేశాల్లో ఈ స్టేజ్​లో నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కరోనా రూల్స్​ను పక్కాగా పాటించాలన్నారు.

న్యూఢిల్లీదేశంలో కరోనా వైరస్​ పీక్​ స్టేజ్​ని దాటేసిందని, రెండు వారాలుగా కేసుల సంఖ్య తగ్గడమే దీనికి నిదర్శనమని ప్రభుత్వ కమిటీ ఆదివారం వెల్లడించింది. కేసులు తగ్గుతున్నయని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే వైరస్​ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తిగా కంట్రోల్​ చేయొచ్చని పేర్కొంది. వైరస్​ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం, కరోనా ప్రొటోకాల్​ పాటించడం ముఖ్యమని తెలిపింది. వచ్చేది చలికాలం.. పైగా పండగల సీజన్​ కావడంతో కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. పండుగల సమయాల్లో జనం గుమిగూడే అవకాశాలు ఎక్కువని, భద్రతా చర్యలు తీసుకోవడం తక్కువని, దీంతో కేసుల సంఖ్య పెరిగే చాన్స్ ఉందని హెచ్చరించింది. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే పండగ సీజన్​ ముగిసే సరికి 26 లక్షల మందికి వైరస్​ సోకుతుందని అంచనా వేసింది. కరోనాపై స్టడీ కోసం ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్ మెడికల్​ రీసెర్చ్, ఐఐటీ మెంబర్లు ఉన్నారు.

97 వేల నుంచి 60 వేలకు..

మొదట్లో ఉన్నంత వేగంగా వైరస్​ వ్యాపిస్తుంటే ఇప్పటికి 1.05 కోట్ల కేసులు రికార్డయ్యేవని చెప్పింది. ఇప్పుడు మన దగ్గర రికార్డైన కేసులు 75 లక్షలేనని కమిటీ గుర్తుచేసింది. రోజుకు 97 వేలకు పైగా కేసులు రికార్డైన స్టేజ్​ నుంచి ఇప్పుడు 60 వేల కేసులకు చేరిందని తెలిపింది. యాక్టివ్​ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నయని గుర్తుచేసింది. ఇప్పుడు వరుసగా రెండో రోజు కూడా యాక్టివ్​ కేసుల సంఖ్య 8 లక్షల కన్నా తక్కువే ఉందని పేర్కొంది. ఆగస్టు 8 నుంచి ప్రపంచంలో రోజువారీ వైరస్​ కేసులు మనదగ్గరే ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. రెండు నెలల తర్వాత పరిస్థితి మారిందని, మన దగ్గర కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోందని వివరించింది. అయితే దాదాపు రెండు నెలల తర్వాత తొలిసారిగా అత్యధిక కేసులు ఆదివారం అమెరికాలో నమోదయ్యాయని చెప్పింది.

75 లక్షలు దాటినయ్

ఆదివారం కొత్తగా 61,871 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 75,01,338కి చేరింది. వరుసగా రెండో రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల లోపే ఉంది. ప్రస్తుతం దేశంలో 7,84,844 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 1,033 మంది వైరస్ వల్ల చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,14,125కు చేరింది. గత రెండు వారాల్లో డెత్స్ సంఖ్య 1,000 దాటడం ఇదే తొలిసారి. అక్టోబర్ 3న చివరి సారిగా మృతుల సంఖ్య వెయ్యి దాటింది. అత్యధికంగా సెప్టెంబర్ 16న 1,290 మంది చనిపోయారు.

30% జనాభాలో యాంటీబాడీలు

పెద్దసంఖ్యలో జనం ఒక్కచోట గుమిగూడడం వల్ల కరోనా కేసులు ర్యాపిడ్​గా పెరిగాయనడానికి ఉదాహరణలు ఉన్నాయని కమిటీ తెలిపింది. కేరళలో ఆగస్టులో జరిగిన ఓనమ్​వేడుకలు ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను పెంచాయని పేర్కొంది. దీంతోపాటు ఇన్ఫెక్షన్​ ప్రాబబిలిటీ 32 శాతానికి పెరగగా, మెడికల్​ రెస్పాన్స్​22 శాతానికి పడిపోయిందని వివరించింది. మరోవైపు, దేశంలో 30 శాతం జనాభాలో కరోనా యాంటీబాడీలు డెవలప్​ అయ్యాయని, కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్​ కూడా జరిగినట్లు గుర్తించామని కమిటీ వెల్లడించింది.

పండుగల సీజన్.. పెద్ద సవాల్

‘‘కరోనా విషయంలో ఇండియా కొంచెం మెరుగైన స్థితిలో ఉంది. అయితే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే 90 శాతం మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది” అని నీతిఆయోగ్​ మెంబర్​ వీకే పౌల్  అన్నారు. దేశంలో కరోనాపై పోరాటంలో తీసుకునే చర్యలను కో ఆర్డినేట్ చేసేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ ఎక్స్​పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్ 19(ఎన్ఈజీవీఏసీ)కి పాల్ చీఫ్​గా ఉన్నారు. పండుగల సీజన్, చలికాలం పోయే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘‘వింటర్ సీజన్ లో నార్త్ ఇండియాలో పొల్యూషన్ కొంచెం పెరుగుతది. మరోవైపు ఫెస్టివల్ సీజన్ కూడా ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. వచ్చే కొన్ని నెలలకు సవాలు లాంటివి” అని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు తగ్గుతున్నాయి కదా అని నిర్లక్ష్యం చేయొద్దని, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నాలను కొనసాగించాలని కోరారు. ‘‘అందరూ జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు పెరిగే ప్రమాదం ఉంది” అని చెప్పారు.