రూ.25 వేల కోట్లతో ..ఉప్పల్​ను అభివృద్ధి చేశాం : బండారి లక్ష్మారెడ్డి

రూ.25 వేల కోట్లతో ..ఉప్పల్​ను అభివృద్ధి చేశాం :  బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, వెలుగు: రూ.25 వేల కోట్లతో ఉప్పల్ సెగ్మెంట్​లో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉప్పల్ సెగ్మెంట్​లో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు సైనిక్ పురి చౌరస్తాలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ బైక్ ర్యాలీ సైనిక్​పురి, కాప్రా, ఈసీఐఎల్, మల్లాపూర్, నాచారం, హబ్సిగూడ, రామంతాపూర్​మీదుగా ఉప్పల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్​లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. 

ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాయన్నారు. ఉప్పల్​లో చెరువులను బ్యూటిఫికేషన్ చేస్తున్నామన్నారు. బీఎల్​ఆర్ ట్రస్టు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేదలను ఆదుకుంటున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఎంబీబీఎస్ చదివే నిరుపేద స్టూడెంట్లకు తమ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. రేపు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.