మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాలకు ఆయన కలెక్టర్​ సంతోష్ తో కలిసి హాజరయ్యారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే వంట గ్యాస్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా మహిళల పేరిటే ఇస్తున్నామని చెప్పారు. 

జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం 2,500 రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని 57 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.5.47 కోట్ల విలువైన చెక్కు అందించారు. అడిషనల్​పీడీ రాజేశ్వరి, కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి

భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ​సంతోష్ ఆదేశించారు. ఆదివారం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనుతో కలిసి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. కల్వకుర్తి, వెల్దండ, వంగూరు, ఊర్కొండ, చారకొండ మండలాల్లోని 73 రెవెన్యూ గ్రామాల నుంచి 3,126 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 2,040 అర్జీలకు సంబంధించి నోటీసులు ఇచ్చామని ఆర్డీవో తెలిపారు. 1,846 దరఖాస్తులను ఆమోదించి, 1,280 అర్జీలను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. 

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మహిళలు ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాలకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అడిషనల్ కలెక్టర్ అమరేందర్ తో కలిసి హాజరయ్యారు. మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. 

 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని 254 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్​లింకేజీ రుణాల కింద రూ.14.22 కోట్ల చెక్కు అందజేశారు. ఐదుగురు సభ్యులకు రూ.50 లక్షల ప్రమాద బీమా, 28 మందికి రూ.17.40 లక్షల లోన్ బీమా చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ చిన్న ఓబులేశు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.