
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర జనాభాకు అనుగుణంగా కొత్తగా నిమ్స్, వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. 10వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం కౌన్సిల్ సమావేశమైంది. మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మించామని, నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సేవలు అందిస్తామని తెలిపారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, జీఎస్‌టీ అమెండ్ మెంట్ బిల్లును హరీశ్ రావు, పంచాయతీరాజ్ శాఖ అమెండ్‌మెంట్ బిల్లును మంత్రి ఎర్రబెల్లి, మైనార్టీ కమిషన్ అమెండ్‌మెంట్ బిల్లును మంత్రి కొప్పుల, ప్రైవేట్ వర్సిటీ అమెండ్‌మెంట్ బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెట్టగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది.