బాల్య వివాహం మన దేశంలో ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక చెడు సంప్రదాయం. బాల బాలికలు తమ బాల్యాన్ని కోల్పోయి విద్య, ఆరోగ్యం, అభివృద్ధి అనే మౌలిక హక్కులను పొందకుండా భారమైన బాధ్యతలను మోసే పరిస్థితి బాల్యవివాహం వల్లే ఏర్పడుతోంది. బాల్యవివాహ రహిత భారతదేశం నిర్మాణం అంటే సమానత్వం, న్యాయం, శక్తిమంతమైన భవిష్యత్తు కోసం ఇచ్చిన భరోసా. బాల్య వివాహం వల్ల విద్యాహక్కు కోల్పోవడం జరుగుతుంది.
ఇది కుటుంబం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధిని కూడా వెనక్కి నెడుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బాలికలకు రక్తహీనత, పోషకాహార లోపం, గర్భకాలపు అనారోగ్యాలు, శిశు మరణాలు ప్రమాదకర స్థాయిలో ఉంటాయి. ఆర్థికంగా వెనుకబడటం, చదువు లేకపోవడం, నైపుణ్యాల కొరత వల్ల ఆర్థికంగా అసమానత పెరుగుతుంది. చిన్న పిల్లలపై అనవసర బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడి, సమస్యలు పెరుగుతాయి.
బాల్య వివాహాన్ని నిరోధించే చట్టం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ – 2006.. యువతుల వివాహ వయస్సు 18 సంవత్సరాలు, యువకుల వివాహ వయస్సు 21 సంవత్సరాలుగా నిర్ధారించింది. ఈ వయస్సుకు తగ్గకుండా జరిగే వివాహం చట్టపరంగా శిక్షార్హం. బాల్యవివాహం జరిపే పెద్దలు, పండితులు, సాక్షులు, పాల్గొన్నవారు అందరికీ శిక్షలు ఉంటాయి.
ప్రతి పౌరుడి బాధ్యత
అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో అవగాహన పెంచడం అత్యంత ముఖ్యం. పాఠశాలలు, గ్రామ సభలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ద్వారా బాల్యవివాహ దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలి. బాలికల విద్య ప్రోత్సహించాలి. విద్య ద్వారా బాలిక సాధికారత పెరుగుతుంది. ఉన్నత విద్యలో రాయితీలు బాల్యవివాహం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బాలల సంక్షేమ కమిటీలు బలోపేతం చేయాలి.
చైల్డ్ లైన్ 1098కు ఫోన్‌చేసి ప్రమాదంలో ఉన్న పిల్లలను రక్షించాలి. బాల్యవివాహాలు పిల్లల జీవితాలను నాశనం చేస్తాయనే అవగాహన తల్లిదండ్రులకు ఇవ్వాలి. స్కూలు టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ సభలు అందరూ కలసి బాల్యవివాహం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. బాల్యం అనేది అమూల్యం.
బాల్య వివాహ రహిత భారత్ అంటే ప్రతి బాలుడు, బాలిక చదువుకోవాలి. సమాన అవకాశాలు కల్పించాలి. ఇది కేవలం ప్రభుత్వపు బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడి బాధ్యత. పేదరికం, అజ్ఞానం, అసమానత్వం వంటి సమస్యలను నిర్మూలించినప్పుడే సురక్షితమైన, శక్తిమంతమైన భారతదేశాన్ని రూపొందించగలం. బాల్యవివాహ రహిత భారతదేశం అనేది అసాధ్యం కాదు. ఇది సాధ్యమే. విద్యతో, అవగాహనతో, ప్రజల భాగస్వామ్యంతో నేటి పిల్లల బాల్యాన్ని రక్షించడం మన ప్రథమ కర్తవ్యం.
ఎం. పరశురాములు, మాజీ చైర్మన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, వరంగల్ జిల్లా
