V6 News

అమిత్ షా ప్రెజర్లో ఉన్నారు.. ఓట్ చోరీపై చర్చకు మేం రెడీ

అమిత్ షా ప్రెజర్లో ఉన్నారు.. ఓట్ చోరీపై చర్చకు మేం రెడీ
  • ఆయన భాష కూడా సరిగ్గా లేదు.. నా ప్రశ్నలకు జవాబులివ్వలేదు: రాహుల్​గాంధీ   
  • కేంద్రం కావాలని తప్పించుకుంటున్నదని ఫైర్ 

న్యూఢిల్లీ:  కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రెజర్​లో ఉన్నారని, లోక్​సభలో తాను వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక ఆందోళనకు గురయ్యారని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అన్నారు. అమిత్ షా భాష కూడా సరిగ్గా లేదని, అబద్ధాలు వల్లెవేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం లోక్​సభలో రాహుల్​ గాంధీ, అమిత్ షా మధ్య మాటల యుద్ధం నడిచింది.

 దీనిపై గురువారం పార్లమెంట్​ ఆవరణలో మీడియా ప్రతినిధులు రాహుల్​ను ప్రశ్నించగా.. ‘‘బుధవారం లోక్​సభలో నా ప్రశ్నలకు సమాధానం చెప్పే టైమ్​లో అమిత్ షా జీ చాలా ఆందోళనగా కనిపించారు. ఆయన చేతులు కూడా వణికిపోయాయి. ఏదో మానసిక ఒత్తిడిలో కూరుకుపోయినట్టు కనిపించారు. అమిత్ షా  మాట తీరు కూడా కరెక్ట్​గా లేదు. తప్పుడు భాషను ఉపయోగించారు. ఇదంతా యావత్​ దేశం చూసింది. 

ఓటు చోరీకి సంబంధించి మీడియా ముందు నేను విడుదల చేసిన ఆధారాలపై లోక్​సభలో చర్చకు సిద్ధమని నేరుగా సవాల్​ విసిరితే.. ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఓట్​ చోరీపై చర్చకు మేం రెడీ. కేంద్ర ప్రభుత్వం కావాలని తప్పించుకుంటున్నది” అని వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వ రంగ సంస్థలపై కేంద్రం కుట్ర

ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్​యూ)లను దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని.. వాటిని అనుచరులకు, ప్రైవేట్​ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నదని రాహుల్​గాంధీ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత్​ ఇమ్యునోలాజికల్స్​ అండ్​ బయోలాజికల్స్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (బీఐబీసీవోఎల్​) సంస్థ ఉద్యోగుల సమస్యలపై ఆయన స్పందించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఐబీసీవోఎల్​ను కేంద్ర ప్రభుత్వం కావాలనే పక్కనబెడ్తున్నదని, అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కొన్నాళ్లుగా శాలరీలు కూడా ఇవ్వడం లేదన్నారు.