మనమంతా ఒక్కటేనన్న ఐక్య భావాన్ని చాటుదాం
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.. అంతా గౌరవిద్దాం
ఇది న్యాయ వ్యవస్థ విజయం: దీవాన్ అలీ ఖాన్
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా దీవాన్ జైనుల్ అబెదీన్ అలీ ఖాన్ చెప్పారు. ప్రజలంతా శాంతి, సామరస్యాలతో ఉండాలని ఆయన సూచించారు.
అయోధ్య వివాదాస్పద భూమిని రామ జన్మభూమి న్యాస్‌కు కేటాయిస్తూ, సున్నీ వక్ఫ్ బోర్డుకు మరో చోట ఐదెకరాల స్థలం ఇవ్వాలని శనివారం ఉదయం తీర్పు చెప్పింది. ఈ జడ్జిమెంట్‌ను అన్ని వర్గాలు శిరసావహిస్తామని చెప్పాయి.
న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనదని, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అజ్మీజ్ దర్గా దీవాన్ అలీ ఖాన్ అన్నారు. ఈ రోజు భారత్‌ను ప్రపంచమంతా చూస్తోందని, మనమంతా ఒక్కటేనన్న ఐక్య భావనను అందరికీ చాటాలని పిలుపునిచ్చారు.
ఇస్లాం ప్రాథమిక సూత్రమిదే
సుప్రీం ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, దేశంలోని ప్రజలంతా సామరస్యంగా ఉండాలని సూచించారు. ఇది న్యాయ వ్యవస్థ విజయమని, ఈ దేశ ప్రజలు న్యాయ వ్యవస్థను ఎంతగా గౌరవిస్తారన్న విషయంతో పాటు, శాంతిని ప్రేమించే దేశమన్న సందేశాన్ని ప్రపంచానికి చాటుదామని చెప్పారు. న్యాయాన్ని, చట్టాలను గౌరవించాలన్నది ఇస్లాంలో ప్రాథమిక సూత్రమని చెప్పారు అజ్మీర్ దర్గా దీవాన్ అలీ ఖాన్. ప్రజలందరి అభివృద్ధితో పాటు దేశ పురోగతిపై ప్రస్తుతం మనమంతా దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.

