
వేములవాడ, వెలుగు: ‘వేములవాడ రాజన్న క్షేత్రం కోట్లాది మంది భక్తుల నమ్మకం, ఆలయ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి, ఈశ్వరుడి అజ్ఞతోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి’ అని శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి చెప్పారు. ఆదివారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో ఆయన మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం రాజన్న ఆలయంలో శాస్త్ర ప్రకారమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పనులు జరగాలని పరమేశ్వరుడిని వేడుకుంటున్నానని చెప్పారు. మనిషి చేసే కర్మలను బట్టే ఫలితాలు వస్తాయన్నారు.
వేములవాడకు చేరుకున్న ధర్మయాత్ర
శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి చేపట్టిన ధర్మ యాత్ర ఆదివారం వేములవాడకు చేరుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కలిసి యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి రాజన్న ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు.
భారతీ మహాస్వామికి రాజన్న ఆలయం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తదనంతరం ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కు చెల్లించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.హరిత, ఎస్పీ మహేశ్ బి.గీతే. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఈవో రమాదేవి, ఆర్డీవో రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ పాల్గొన్నారు.