ఆస్పత్రులు ఎక్కువ ఫీజు వసూలు చేస్తే రీఫండ్ చేయిస్తాం

ఆస్పత్రులు ఎక్కువ ఫీజు వసూలు చేస్తే రీఫండ్ చేయిస్తాం
  • వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు
  • 114 ప్రైవేట్ ఆస్పత్రుల మీద 185 ఫిర్యాదులు వచ్చాయి
  • 22 ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సను రద్దు చేసాము
  • అధికంగా వసూలు చేసిన ఫీజులను కోర్టు సూచనల మేరకు వాపస్ ఇప్పిస్తాం: శ్రీనివాసరావు

హైదరాబాద్: కార్పొరేట్ ఆస్పత్రుల మెడపై కత్తి పెట్టి చికిత్స కోసం అడ్డగోలుగా వసూలు చేసిన డబ్బును కక్కించాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. కేవలం ఆస్పత్రుల అనుమతులు రద్దు చేసి చేతులు దులుపుకుంటే ఎలా.. వసూలు చేసిన అధిక ఫీజులను ముక్కు పిండి వసూలు చేయాల్సిందేనంటూ హైకోర్టు తేల్చిచెప్పడంతో ఎట్టకేలకు ఆయన చర్యలపై బహిరంగంగా పెదవి విప్పారు. 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 114 ప్రైవేటు ఆస్పత్రుల మీద ఇవాళ్టి వరకు 185 ఫిర్యాదులు వచ్చాయని, హైదరాబాద్ 72 ఫిర్యాదులు, మేడ్చల్ లో 49 ఫిర్యాదులు, 12 జిల్లాలో ఫిర్యాదులు వచ్చాయని ఆయన వివరించారు. ఫిర్యాదులకు స్పందించి తాము ఇచ్చిన షోకాజ్ నోటీసులకు 22 ఆస్పత్రుల యాజమాన్యాలు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సదరు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సను రద్దు చేశామన్నారు. అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా నిబంధనలు, ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తమకు అందిన ఫిర్యాదులపై స్పషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. కోర్ట్ సూచనల మేరకు హాస్పిటల్స్ వైద్యులు, యాజమాన్యాలతో చర్చలు జరిపి...ఎక్కువగా వసూలు చేసిన ఫీజును పేషంట్స్ కు రీఫండ్ చేయిస్తామన్నారు.
ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచే ఎక్కువ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ఉదృతి తగ్గిందని అయితే ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచే ఎక్కువ కేసులు వస్తున్నట్లు గుర్తించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను పరిశీలించామన్నారు. రేపు గద్వాల జిల్లా ఏరియా పరిశీలిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రూరల్ ఏరియా లో కేసులు వస్తున్నాయని,వారి బోర్డర్స్ లో ఉండడం వల్ల.. మన గ్రామాల్లో పరిస్థితి అంచనా వేస్తున్నామన్నారు. 
తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గింది.. కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ వచ్చింది
తెలంగాణలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిపోయిందని, ఈ రోజు 1 లక్ష 10వేల టెస్ట్ లు చేసాం.. 2261 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన వెల్లడించారు. పాజిటివిటి రేట్ 2 శాతం మాత్రమే ఉందని, 3 వేల 43 మంది రికవరీ అయ్యారని, మరో 18 మంది చనిపోయారని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. లాక్ డౌన్ మొదటి వారంలో బెడ్ ఆక్యుపెన్సీ 52 శాతం ఉండేది, ఇప్పుడు అది కేవలం 26 శాతం మాత్రమే ఉందన్నారు. 55 వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. 
కేసులు తగుతున్నాయని నిర్లక్ష్యం వహించొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. కొన్ని రాష్ట్రలో థర్డ్ వేవ్ వచ్చింది.. జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రిస్క్ టెకర్లకు ప్రతిరోజు  30 వేల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని, ఇప్పటి వరకు 7.5 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తామని, ఇవాళ ఒక్కరోజే 77 వేల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ఐపీఎంలో వ్యాక్సిన్ వేస్తామన్నారు. తమ అధికారిక వెబ్ సైట్ ఈ రోజు నుంచి పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ 9 లక్షల వరకు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు.