రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు
  • కాంటాలు పెట్టకపోతే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి
  • మిల్లుల్లో ఎఫ్​సీఐ తనిఖీలతోనే కొనుగోళ్లు ఆలస్యం 
  • రాష్ట్రం వడ్లు కొంటుంటే కేంద్రం కాళ్లల్లో కట్టె పెడ్తోంది: మంత్రి గంగుల

కరీంనగర్, వెలుగు: అకాల వర్షాలకు కల్లాల్లో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సివిల్ సప్లయ్స్ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల, చింతకుంట, కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్, మొగ్ధుంపూర్, చర్లభూత్కూర్, నగునూర్ గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్​, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. దుర్శేడ్ లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన గోదామ్ ను టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. 

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. వడ్లు కొనే టైంలో మిల్లుల్లో తనిఖీల పేరుతో ఎఫ్ సీఐ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్ర సర్కార్ వడ్లు కొంటుంటే చూడలేక కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తోందని కేంద్రంపై మండిపడ్డారు. కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదని బద్నాం చేస్తున్నారని.. కానీ 3,525 సెంటర్లు ఓపెన్ చేసి 4.32 లక్షల టన్నుల వడ్లు కొన్నామని వెల్లడించారు. గన్నీ సంచుల కొరత లేదన్నారు. 15 కోట్ల సంచులు కావాల్సి ఉండగా, ఇప్పటికే 8 నుంచి 9 కోట్ల బ్యాగులు పాతవి సేకరించామని చెప్పారు. కొత్త వాటి కోసం టెండర్లు వేశామన్నారు. 

కావాలనే ఎఫ్​సీఐ దాడులు.. 

వడ్ల కొనుగోళ్లకు గతంలో లేని విధంగా కేంద్రం అనేక కొర్రీలు పెడుతోందని గంగుల మండిపడ్డారు. అయినప్పటికీ రూ.3 వేల కోట్ల నిధులతో వడ్లు కొనేందుకు రాష్ట్ర సర్కార్ సెంటర్లు ప్రారంభించిందని చెప్పారు. 2,900 మిల్లుల్లో ఒకటో రెండో తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని.. తక్కువ వడ్లు, బియ్యం వస్తే కేంద్రానికి సంబంధం లేదని అన్నారు. వడ్లు కొనే టైమ్ లో తనిఖీలు చేపడుతుండడంతో మిల్లుల్లోని హమాలీలంతా నెట్​ కొట్టడానికే సరిపోతున్నారని, ఇక వడ్లు ఎవరు దించుకోవాలని ప్రశ్నించారు. తనిఖీలకు ఇది సమయం కాదని, ఇది మూర్ఖత్వపు ఆలోచన అని ఫైర్ అయ్యారు. కొనుగోళ్లు మొత్తం అయ్యాక రాష్ట్ర ప్రభుత్వమే తనిఖీలకు సహకారం అందిస్తుందన్నారు. ఇష్టానుసారం తనిఖీలు చేయడం సరికాదని, అకాల వర్షాలు పడితే రైతులు నష్టపోతారని అన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని, తనిఖీలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్ సీఐ చేస్తున్న దాడుల్లో రాజకీయ కోణం ఉందని 
ఆరోపించారు.