
అమరావతి: 2025, మే 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో ప్రధాని మోడీనే అమరావతి పనులకు శంఖుస్థాపన చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని అన్నారు. ఇప్పుడు మళ్లీ మోడీ చేతుల మీదుగానే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. కేంద్రం సహకారంతో అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నామన్నారు.
34 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద రైతుల ఇచ్చారని గుర్తు చేసిన చంద్రబాబు.. అమరావతి రైతులు వీరోచితంగా పోరాడారు, ఇది వాళ్ల విజయమని ప్రశంసించారు. అమరావతి రైతులు చేసిన ఉద్యమం లాంటి ఉద్యమాన్ని ఇంత వరకు నేను ఎప్పుడూ చూడలేదన్నారు. శుక్రవారం వెలగపూడిలో ఏర్పాటు చేసిన అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి నా రాజధాని అని చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రధాని మోడీ, కేంద్ర సహకారంతో అమరావతిని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని పేర్కొన్నారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని.. మళ్లీ అప్పుడు అమరావతి ప్రారంభోత్సవానికి కూడా మోడీనే రావాలని కోరారు. సకల హుంగులతో ప్రపంచం మెచ్చే విధంగా అమరావతిని తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాలకు అమరావతిని అనుసంధానిస్తామని చెప్పారు. 5 లక్షల మంది విద్యార్థులు అమరావతిలో చదువుకునేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
►ALSO READ | మోడీ జీ ఒట్టేసి చెబుతున్నా.. ఆ విషయంలో మీకు ఎప్పుడు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
భావితరాల భవిష్యత్ కు భరోసా ఇస్తున్నా.. విద్య, వైద్య కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అత్యుత్తమ విద్యా సంస్థలు అమరావతిలో ఉన్నాయని తెలిపారు. బిట్స్ పిలాని, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. అమరావతిని వరల్డ్ క్లాస్ రాజధానిగా తీర్చి దిద్దుతామని.. అమరావతి చరిత్రలో ప్రధాని మోదీ పేరు నిలిచిపోతుందని అన్నారు.