
అమరావతి: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (మే 2) వెలగపూడిలో ఏర్పాటు చేసిన అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రధాని మోడీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండేవారు. కానీ ఇటీవల ఆయనను కలిసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో మోడీ తీవ్ర బాధలో ఉన్నారని అన్నారు.
Also Read ; అమరావతి రైతుల త్యాగాన్ని ప్రధాని మోదీ గుర్తించారు
ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రం చేపట్టే ప్రతి చర్యకు అండగా ఉంటామని.. ఈ విషయంలో ప్రధానికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. మోడీ జీ.. మేమంతా మీకు అండగా ఉన్నామని అన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన ప్రధాని దొరికారని కొనియాడారు. మోడీ అత్యంత బలమైన నేత అని అన్నారు.
ఆయన ప్రధాని అయ్యే నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పదో స్థానంలో ఉందని.. కానీ ఇవాళ మన దేశం ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో ఉందని పేర్కొన్నారు. మోడీ కొత్త ఇండియాను నిర్మిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలనేది అతిపెద్ద నిర్ణయమని.. కుల గణన చేస్తే దేశం మరోస్థాయిలో ఉంటుందని అన్నారు. దేశాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రధాని మోడీ పని చేస్తున్నారని పొగిడారు. మోడీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతుందన్నారు.