వరంగల్ ఆర్బన్: వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పై కషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ సమస్యలపై బీజేపీ పోరాటం చేసింది, అందుకే ప్రజల నుంచి అనూహ్య స్పందన కన్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తేలిందన్నారు. వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూకబ్జాలు చూసి.. టీఆర్ఎస్ నాయకులను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆల్రేడీ వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ ఉంది.. ఆ కోచ్ ఫ్యాక్టరీకి కోచ్ కేసీఆరే...భూబ్జాలపై ఇక్కడి ఎమ్మెల్యేలకు కోచింగ్ ఇచ్చేది కేసీఆరేనని ఆయన విమర్శించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ లోనే అత్యధిక కబ్జాలు పెరిగాయని, సర్వే నెంబర్ 697, 688, 699 భూములను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కబ్జా చేశారని, స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నాను..నిరూపించడానికి మేము రెడీ అని బండి సంజయ్ చెప్పారు. రౌడీ షీటర్లు, తలలు నరికిన రౌడీలు, నగర బహిష్కరణకు గురైన గుండాలకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందని, గుండాలుచ రౌడీలు కావాలో ప్రజాసేవ చేసేవారు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. ఓరుగల్లు ప్రజల్లో కాకతీయుల రక్తం ప్రవహిస్తోందని, పౌరుషాల గడ్డ ఓరుగల్లు ప్రజలు కబ్జాకోరులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు తప్పుడు అభ్యర్థులను ఎంపిక చేశామని భద్రకాళీ గుడి వద్ద ముక్కు నేలకు రాయాలని బండి సంజయ్ సూచించారు.
