ప్రశాంత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం

ప్రశాంత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం
  •      భువనగిరి గురుకులలో ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరం
  •     సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ సీతాలక్ష్మి ప్రకటన

హైదరాబాద్, వెలుగు: భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరమని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సోసైటీ (టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్) సెక్రటరీ సీతాలక్ష్మి అన్నారు. ఈ నెల 12న కలుషిత ఆహారం తిని 26 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయని ఆమె బుధవారం ఒక ప్రకటనలో  తెలిపారు. దాంతో విద్యార్థులను సిబ్బంది చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారని వివరించారు.

అందులో ఆరోతరగతి చదివే ప్రశాంత్‌‌ అనే స్టూడెంట్..మంగళవారం రాత్రి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత్ మృతి బాధాకరమని, అతడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇస్తామని సీతాలక్ష్మి ప్రకటించారు. ఇప్పటికే అంత్యక్రియలకు రూ20వేలు అందించామని, ఈ సాయం పెంచాలని కుటుంబసభ్యులు కోరుతున్నందున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆమె తెలిపారు. మిగతా విద్యార్థులకు ట్రీట్మెంట్ అందుతుందని.. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ప్రాథమిక విచారణ తరువాత స్కూల్ ప్రిన్సిపల్ శ్రీరామ్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశామన్నారు.