కావాలంటే ఇంకా అప్పులిస్తాం

కావాలంటే ఇంకా అప్పులిస్తాం

చిన్న కంపెనీలకు ఫస్ట్ ఫ్రిఫరెన్స్

బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాం

పరిశ్రమలకు ఇంకా సహకరిస్తాం

5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధ్యమే

ఎస్‌బీఐ చైర్మన్‌ రజ్‌నీశ్‌ కుమార్‌

హైదరాబాద్‌: ఎకానమీకి కీలకమైన చిన్న, మధ్యతరహా కంపెనీలకు (ఎస్​ఎంఈలు)లకు మరిన్ని లోన్లు ఇస్తామని ఎస్​బీఐ చైర్మన్​ రజనీశ్​ కుమార్​ ప్రకటించారు.  ఇవి పన్నుల వ్యవస్థ పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి మరింత ఆర్థికసాయం చేయవచ్చని అన్నారు.  మనదేశానికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగే సత్తా ఉందని అభిప్రాయాపడ్డారు. కచ్చితంగా ఐదేళ్లలోపే టార్గెట్‌ను చేరుకుంటామో లేదో తెలియదు కానీ మన ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉందని స్పష్టం చేశారు. పోటీ తత్వాన్ని, ప్రైవేటు ఇన్వెస్ట్​మెంట్లను పెంచగలిగితే అనుకున్నది సాధిస్తామని చెప్పారు. ఇన్​ఫ్రాకు ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇస్తే జీడీపీ పెరుగుతుందని అన్నారు.

హైదరాబాద్‌లో శనివారం ఫిక్కీ తెలంగాణ కౌన్సిల్‌ ‘ఫిక్కీ డైలాగ్‌ ఫర్‌ యాక్షనేబుల్‌ ఇన్‌సైట్స్‌’ పేరుతో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో ఎకానమీ, బ్యాంకింగ్‌, కంపెనీ వ్యవహారాలపై కుమార్​ తన అభిప్రాయాలను పంచుకున్నారు. బ్యాంకులపై నమ్మకం తగ్గిన మాట నిజమని, అయితే విశ్వాసాన్ని తిరిగి పొందడానికి మరింత కష్టపడతామని హామీ ఇచ్చారు. బ్యాంకులకు టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్లు కీలకంగా మారాయని తెలిపారు. చాలా మంది ఎస్‌బీఐ కస్టమర్లు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ నుంచి మొబైల్‌ బ్యాంకింగ్‌కు మారారని వెల్లడించారు. ‘‘బ్యాంకింగ్‌లో టెక్నాలజీని పెంచుతాం. ఫిన్‌టెక్‌ కంపెనీల నుంచి బ్యాంకులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీతోపాటు ఉద్యోగుల్లో నైపుణ్యాలనూ పెంచుతాం.  రిటైల్‌ బ్యాంకు కస్టమర్లను పెంచుకుంటున్నాం. కార్పొరేట్‌ బ్యాంకింగ్‌కు ఇంకింత ప్రాధాన్యం ఇస్తున్నాం. గత ఏడాది 1.75 లక్షల కోట్ల విలువైన హోం లోన్లు ఇచ్చాం. జీఎస్టీ విధానం మంచిదే అయినా, కొన్ని లోపాలూ ఉన్నాయి.  కొత్త దివాలా చట్టం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. ముఖ్యంగా స్టీల్‌ కంపెనీల మొండిబకాయిలు పెద్ద ఎత్తున వసూలు అవుతున్నాయి. మహిళా ఎంటర్‌‌ప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రొడక్టులను తీసుకొచ్చాం. స్వయం సహాయక బృందాలకూ లోన్లు ఇస్తున్నాం. 22 వేల మంది మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం’’ అని ఆయన వివరించారు.

విలీనాల వల్ల లాభమే 

బ్యాంకుల విలీనంపై అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ చిన్న బ్యాంకులన్నింటినీ కలిపి ఒకే బ్యాంకుగా మార్చడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ‘‘చిన్న బ్యాంకులు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కు ఎక్కువగా ఖర్చు చేయలేవు. వాటికి క్యాపిటల్‌ తక్కువగా ఉంటుంది. పెద్ద బ్యాంకులో విలీనం కావడం వల్ల మరింత మేలు జరుగుతుంది. పనితీరు మెరుగుపడుతోంది. లోన్‌బుక్‌ విలువ పెరుగుతుంది. ఎక్కువ సంఖ్య ప్రభుత్వ బ్యాంకులు ఉండటం వల్ల ప్రత్యేకంగా మేలు ఏమీ జరగదు’’ అని వివరించారు. అనంతరం ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి మాట్లాడుతూ  స్టాక్‌ మార్కెట్ బాగానే ఉన్నా.. కొనుగోళ్లు, ప్రైవేటు ఇన్వెస్‌మెంట్లు బాగాపడిపోయాయని అసంతృప్తి ప్రకటించారు.  ఎఫ్‌డీఐలు బాగానే ఉన్నాయని ప్రశంసించారు. అన్ని ప్రభుత్వశాఖలు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. ఎకానమీని గట్టెక్కించడానికి ప్రభుత్వం కనీసం రూ.లక్షల ప్యాకేజీ ఇవ్వాలన్నారు.